సెల్ ఫోన్ డ్రైవింగ్ కు జైలు శిక్షనా? : హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్ : చిన్నపాటి తప్పులకూ జైలుశిక్ష విధించడం సబబుకాదంటూ కింది కోర్టులకు హైకోర్టు సూచించింది. ఫోన్ లో మాట్లాడుతూ ..బైక్ నడిపిన ఓ యువకుడికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టింది. జైలుకు వెళ్లి  వచ్చిన వారికి సమాజంలో ఎదురయ్యే కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్ నాథ్‌ గౌడ్ బెం చ్ పేర్కొంది. సెల్ ఫోన్ డ్రైవింగ్​నేరానికి తన మేనల్లుడు ఎంవీ భరధ్వాజ్ కు మేజిస్ట్రేట్ కోర్టు నాలుగు రోజుల శిక్ష విధించిందంటూ కొండాపూర్ కు చెందిన పతంగి రమాకాం త్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. సెల్ ఫోన్ డ్రైవింగ్​కు జైలు శిక్ష విధించడం అన్యాయమని పి టిషనర్‌ తరఫు లాయర్‌ వాదించారు.

ప్రభుత్వ సహాయ న్యాయవాది ప్రతివాదన చేస్తూ నేరాంగీకారం తర్వాతే కింది కోర్టు జైలు శిక్ష విధించిందన్నారు. దీనిపై డివిజన్‌ బెంచ్‌ స్పందిస్తూ.. భరద్వాజ్‌ ఎలాంటి ప్రమాదం చేయలేదని, రూ.500 జరిమానా విధించి హెచ్చరించి వదిలిపెట్టాలని ఆదేశించింది. భరద్వాజ్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే కింది కోర్టు మేజిస్ట్రేట్ ను పిటిషనర్‌ ప్రతివాదిగా చేయడాన్ని డివిజన్‌ బెంచ్‌ తప్పుపట్టింది.

Latest Updates