సెల్ ఫోన్ లోడ్ కొట్టేసి.. ఖాళీ కంటైనర్ వదిలారు

నెల్లూరు: సెల్ ఫోన్ తయారీ కంపెనీ నుంచి లోడ్ తో వెళ్తున్న లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. లారీ కంటైనర్ లో ఉన్న ఫోన్లన్నీ కొట్టేసి ఖాళీ కంటైనర్ ను వదిలి పరారయ్యారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.

శ్రీ సిటీ సెజ్ లోని సెల్ ఫోన్ తయారీ కంపెనీ నుంచి కంటైనర్ నిండా లోడ్ తో లారీ నిన్న రాత్రి కోల్ కతాకు బయలుదేరింది. అది కొంత దూరం వెళ్లాక కొందరు దుండగులు లారీని అడ్డగించారు. డ్రైవర్ ను కొట్టి లారీని తీసుకెళ్లిపోయారు. కంటైనర్ లో ఉన్న ఫోన్లన్నీ ఖాళీ చేసి జిల్లాలోని కావలి సమీపంలో గౌరవరం డాబాల దగ్గర లారీని వదిలేశారు.

ఈ ఘటనపై లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాని కోసం వెతుకులాట మొదలుపెట్టిన పోలీసులు దాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. కంటైనర్ లోని సెల్ ఫోన్లన్నీ దుండగులు మరో లారీలోకి మార్చి తీసుకెళ్లారని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, సెల్ ఫోన్ల లోడ్ బయలుదేరుతున్నవిషయం ముందే తెలిసిన వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లారీలో 4 కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ఉన్నాయని తెలుస్తోంది.

Latest Updates