రేట్ల కోసం కుమ్మక్కవుతుంది మేము కాదు బిల్డర్లే!

హైదరాబాద్‌, వెలుగు: టాప్‌‌ సిమెంట్‌‌ కంపెనీలు కుమ్మక్కయ్యి రేట్లు పెంచుతున్నాయని క్రెడాయ్‌‌, బిల్డర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను సౌత్‌‌ ఇండియా సిమెంట్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌(ఎస్‌‌ఐసీఎంఏ) మంగళవారం ఖండించింది. తప్పుడు సమాచారం ఇస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొంది. వర్చువల్‌‌గా జరిగిన మీడియా సమావేశంలో ఎస్‌‌ఐసీఎంఏ ప్రెసిడెంట్‌‌ ఎన్‌‌ శ్రీనివాసన్‌‌, వైస్ ప్రెసిడెంట్‌‌ రవీందర్‌‌‌‌ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌‌ లాంటి సిటీలలో చదరపు అడుగు(చ.అ) రూ. 8,000 వేల నుంచి రూ. 10,000 లకు బిల్డర్లు అమ్ముతున్నారని శ్రీనివాసన్ అన్నారు. 100 శాతం మార్జిన్‌‌తో వీరు అమ్మకాలు జరుపుతూ  సిమెంట్ కంపెనీలు కుమ్మక్కయ్యి  రేట్లు పెంచుతున్నాయని ఆరోపిస్తున్నారని చెప్పారు. బిల్డింగ్ కన్‌‌స్ట్రక్షన్‌‌లో సిమెంట్ కాస్ట్ 2–3 శాతం కూడా ఉండదని, కానీ రేట్లు పెరిగాయని క్రెడాయ్‌‌, బీఏఐలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్లో అనేక సిమెంట్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని, కస్టమర్లకు బస్తా రూ. 200 నుంచి రూ. 400 మధ్యలో దొరుకుతున్నాయని అన్నారు. ఇన్‌‌ఫుట్‌‌ కాస్ట్‌‌లు పెరుగుతున్నా సిమెంట్ ఇండస్ట్రీ రేట్లు పెంచడం లేదని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ లేకపోతే కంపెనీలు తమ మార్జిన్లు వదులుకుంటున్నాయి కాని రేట్లు పెంచడం లేదని అన్నారు.  ఇండియాలో ఏ బిల్డింగ్‌‌ కూడా సిమెంట్‌‌ కొరత వలన ఎప్పుడూ ఆగిపోలేదని, ఇక్కడ డిమాండ్ కంటే సప్లయ్‌‌ ఎక్కువగా ఉందని చెప్పారు. నార్త్‌‌, ఈస్ట్‌‌, సెంట్రల్‌‌ ఇండియాలలో సిమెంట్ డిమాండ్‌‌ కరోనా ముందు స్థాయిలకు చేరుకుందని శ్రీనివాసన్ అన్నారు. కానీ సౌత్‌‌ ఇండియాలో కరోనా ముందు స్థాయి కంటే సిమెంట్‌‌ డిమాండ్‌‌ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.

బిల్డర్లపై ప్రధానికి లెటర్‌‌‌‌..

బిల్డర్లు కుమ్మక్కయ్యి  ధరలు పెంచుతున్నారని ప్రధానికి రాసిన లెటర్‌‌‌‌లో ఎస్‌‌ఐసీఎంఏ ఆరోపించింది. హైదరాబాద్‌‌లో ఒక చదరపు అడుగు  ధర రూ. 1,500 ఉంటుందని, కన్‌‌స్ట్రక్షన్ కాస్ట్‌‌ రూ. 4,500 వేసుకున్నా ఒక చ. అ ధర రూ. 6,000 ఉండాలని పేర్కొంది. కానీ బిల్డర్లు ఒక చ.అ రూ. 8 వేల నుంచి 10 వేల మధ్య అమ్ముతున్నారని తెలిపింది. 100 శాతం మార్జిన్లు పొందుతున్నా రేట్లను తగ్గించడంలేదని,  ముఖ్యంగా క్రెడాయ్, బిల్డర్స్‌‌ అసోసియేషన్‌‌ కింద ఉన్న బిల్డర్లు కుమ్మక్కయ్యి రేట్లు పెంచుతున్నారని ఆరోపించింది. ధరలు ఎందుకు పెంచుతున్నారంటే ఇన్‌‌కాస్ట్ పెరిగిందనే వంకలు చెబుతున్నారని, ముఖ్యంగా సిమెంట్‌‌ ధరలు పెరగడాన్ని సాకుగా చూపుతున్నాయని లెటర్‌‌‌‌లో పేర్కొంది. ఒక చ.అ కట్టడానికి సగం సిమెంట్ బస్తా సరిపోతుందని, బస్తాపై రూ. 100 పెరిగిన బిల్డర్లకు అయ్యే ఖర్చు కేవలం రూ. 50 మాత్రమేనని తెలిపింది. కన్‌‌స్ట్రక్షన్‌‌లో సిమెంట్ వలన అయ్యే ఖర్చు 2–3 శాతం కూడా ఉండదని తెలిపింది

Latest Updates