వలస కూలీలు సొంతూళ్లకు పోవచ్చు

స్టూడెంట్లు , టూరిస్టులు కూడా..
లాక్డౌన్లో చిక్కుకున్న వారికి గ్రీన్సిగ్నల్
షరతులతో అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం
టెస్టులు చేసి, లక్షణాలు లేకుంటేనే పంపాలి
బస్సుల్లో దూర దూరంగా కూర్చోవాలి
సొంతూళ్లకు వెళ్లాక క్వారంటైన్లో ఉంచాలి

న్యూఢిల్లీ: లాక్ డౌన్తో నెలకుపైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం కొన్ని షరతులతో అనుమతిచ్చింది. వలస కూలీలు, స్టూడెంట్లు, టూరిస్టులు, భక్తులతో పాటు ఇతర పనులపై వేరే రాష్ట్రాలకు వెళ్లి ఉండిపోయిన వారు సొంతూర్ల‌కు వెళ్లేందుకు ఓకే చెప్పింది. బుధవారం కేంద్ర హోంశాఖ సెక్రెటరీ అజయ్ భల్లాజారీ చేసిన ఆదేశాల్లో ‘‘లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, స్టూడెంట్లు, టూరిస్టులు, భక్తులు, ఇతరులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాం ”అని ప్రకటించింది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది వలస కూలీలకు, చదువు కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకు పోయిన స్టూడెంట్లకు దీని వల్ల ప్రయోజనం కలగనుంది.

ఎక్కడికక్కడే చిక్కుకున్న లక్షలాదిమంది

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించిన సందర్భంలో ప్రధాని మోడీ ఎక్కడి జనం అక్కడే ఉండాలని సూచించారు. ప్రస్తుతం లక్షలాది మంది వలస కూలీలు, టూరిస్టులు, స్టూడెంట్లు , ఇతరులు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయారు. పనిలేక, ఉండేందుకు చోటు లేక లక్షలాది మంది ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై త‌దితర సిటీల నుంచి కాలినడకనే సొంతూర్ల‌కు పయనమయ్యారు. వందల, వేల కిలో మీటర్లు నడిచారు. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురుకావడంతో.. వలస కూలీలు సరిహద్దులు దాటేందుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో చాలా మందిని రాష్ట్రాలు అడ్డుకుని షెల్టర్ హోమ్స్ కు తరలించి ఆహారం, ఇతర సౌకర్యాలను అందజేస్తున్నాయి.

సొంతవెహికల్స్ పై నో క్లారిటీ

ఒక వ్యక్తి లేదా ఫ్యామిలీ ప్రైవేట్ వెహికల్ లో ట్రావెల్ చేయవచ్చా లేదా ఒకవేళ అనుమతిస్తే ఎలాంటి సందర్భాల్లో పర్మిషన్ ఇస్తారనే దానిపై హోంశాఖ క్లారిటీ ఇవ్వలేదు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్ గా కేంద్ర హోంశాఖ సెక్రెటరీ ఈ ఆదేశాలిచ్చారు. కాగా, సెంట్రల్ హెల్త్ , ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ జారీ చేసిన హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్, అస్సాం, చత్తీస్ గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వేలాది మంది స్టూడెంట్లు, టూరిస్టులను సొంత రాష్ట్రాలకు రప్పించాయి.

సొంత రాష్ట్రాలకువెళ్లేందుకు కేంద్రం పెట్టిన షరతులివీ..

ఒక చోట చిక్కుకుపోయిన వారిని పంపేందుకు, రప్పించేందుకు రాష్ట్రాలు/యూటీలు నోడల్ ఆఫీసర్ల‌ను నియమించాలి. ఇందు కోసం ప్రత్యేకంగా స్టాండర్ట్ ప్రొటోకాల్ రూపొందించాలి. తమ తమ రాష్ట్రాలు/యూటీల్లో చిక్కుకున్న వారి వివరాలను నోడల్ ఆఫీసర్లు రిజిస్టర్ చేయాలి. ఒక చోట చిక్కుకుపోయిన వ్యక్తుల గ్రూపు ఒక రాష్ట్రం/యూటీ నుంచి మరో రాష్ట్రం/యూటీకి వెళ్లాలంటే.. వారిని పంపే రాష్ట్రం, రిసీవ్ చేసుకునే రాష్ట్రంముందుగా సంప్రదింపులు జరపాలి. రోడ్డు మార్గం ద్వారా వారిని పంపేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలపాలి. ఇలా తరలించే ప్రతి వ్యక్తినీ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు లేవని తేలిన తర్వాతే సదరు వ్యక్తులు వెళ్ల‌డానికి అనుమతి ఇవ్వాలి. వీరిని తరలించేందుకు బస్సులను వాడాలి. బస్సులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. సీటింగ్ విషయంలోనూ సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను పాటించాలి. వీరిని తరలించే బస్ రూట్ లో ఉన్న రాష్ట్రాలు/యూటీలు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి. వారు రిసీవింగ్ స్టేట్/యూటీలకు వెళ్లేందుకు సహకరించాలి. సొంతూర్ల‌కు వెళ్లిన‌ తర్వాత లోకల్ హెల్త్ స్టాఫ్ వారిని చెకప్ చేయాలి. అందరినీ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచాలి. అవసరమైన వారిని గవర్నమెంట్ క్వారంటైన్ కు తరలించి.. అబర్జర్వేషన్ లో ఉంచాలి. ఎప్పటికప్పుడు వారికి హెల్త్ చెకప్ లు చేయాలి. వీరిని ఆరోగ్యసేతు యాప్ వాడేలా యంకరేజ్ చేయాలి. దీని ద్వారా వారి హెల్త్ స్టేటస్ ను మానిటర్ చేయడానికి ట్రాక్ చేయడానికి అధికారులకు వీలవుతుంది.

Latest Updates