మళ్లీ పుంజుకుంటాం

దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌‌ దీనిని తయారు చేశారు. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికాభివృద్ధిపై, జీడీపీ రేటుపై ఇది సానుకూల అంచనాలను వెల్లడించింది. సర్వే నివేదిక దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఏడుశాతం నమోదవుతుందని పేర్కొంది. 2024 నాటికి ఐదు ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలంటే వృద్ధిరేటు మరింత పెరగాలని స్పష్టం చేసింది. ఇందులోని వివరాల ప్రకారం… 2011 నుంచి పెట్టుబడుల రేటు తగ్గుతోంది. అయితే కన్జూమర్‌‌ డిమాండ్‌‌, బ్యాంక్‌‌ లెండింగ్‌‌ పెరుగుతున్నందున ఈ రేటు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల పన్నుల రాబడి తగ్గవచ్చు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాలి కాబట్టి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతాయి. వాస్తవిక జీడీపీ వృద్ధి ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఐదేళ్ల కనిష్టం 5.8 శాతంగా నమోదయింది. ఇది చైనా వృద్ధిరేటు 6.4 శాతం కంటే తక్కువ. గత ఆర్థిక సంవత్సరం ఇండియా 7.2 శాతం వృద్ధిరేటు సాధించింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు నిరాశపర్చుతున్నప్పటికీ వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పొదుపు పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం ద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడం సాధ్యపడుతుంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించగలిగితే డిమాండ్‌‌, సామర్థ్యం, కార్మిక ఉత్పాదకత పెరుగుతాయి. కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టవచ్చు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

సర్వే ముఖ్యాంశాలు…

..గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏడు శాతానికి చేరుతుంది. ఇన్వెస్ట్‌‌మెంట్లు, వినిమయం పెరగడం వల్ల జీడీపీ వృద్ధీ పెరుగుతుంది.  డిమాండ్, రుణ లభ్యత పెరగ డం వల్ల పెట్టుబడుల రేటూ పెరుగుతుంది.

..ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల పన్నుల రాబడి తగ్గవచ్చు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాలి కాబట్టి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.

..స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఎదుగుదలకు చాలా అవకాశాలు ఉంటాయి. 2024 నాటికి ఐదు ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలంటే ఎనిమిది శాతం వృద్ధిరేటు అవసరం.

..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వినియోగం పెరుగుతుంది. ఈ ఏడాది జూన్‌‌ నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 422 బిలియన్ డాలర్లకు చేరాయి.

..ద్రవ్యలోటు తగ్గింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతం కాగా, అంతకుముందు ఏడాది ఇది 6.4% నమోదయింది.

..ఈ ఏడాది ఎగుమతులు 15.4 శాతం, దిగుమతులు 12.5 శాతం పెరుగుతాయి. 28.34 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి.

..వ్యవసాయరంగం కోలుకోవడం, సాగు ఉత్పత్తుల ధరలను బట్టి డిమాండ్‌‌ ఉంటుంది. గ్రామీణ వినిమయానికి ఇవి రెండూ కీలకం. వర్షపాతమూ కీలకమే. ఈసారి కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

..సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌‌ఎంఈ)ల ఎదుగుదలకు ఉన్న ఆటంకాలను కొత్త విధానాలు తొలగిస్తాయి. ఉద్యోగాలను, ఉత్పాదకతనూ పెంచుతాయి.

..జనాభా వేగంగా పెరుగుతున్నందున, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యసంరక్షణకు మరిన్ని నిధులను అందించాలి. దశలవారీగా రిటైర్‌‌మెంట్‌‌ వయసును పెంచాలి.

..తక్కువ జీతాలు, వేతన అసమానతలు సమగ్ర వృద్ధి సాధనకు అవరోధాలుగా మారుతాయి. ఈ పరిస్థితిని మార్చడానికి సంస్కరణలు అవసరం.