మత్స్యకారులకు మంచి కబురు!

మోడీ సర్కారు ఇటీవల ఫిషరీష్​ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఇలాంటి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి.  చేపల పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి రూట్​ క్లియర్​ అయిందని చెప్పొచ్చు. చేపల వేటని  రెగ్యులేషన్​, చేపల పరిశ్రమని మేనేజ్​మెంట్​ చేసే చర్యలు  ఊపందుకోనున్నాయి.  ఈ సరికొత్త పరిణామంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు.

దేశంలో చేపలు పట్టడమనేది ఇంతకాలం కుల వృత్తిగానే సాగింది. ఇప్పుడు అది ఒక పరిశ్రమ స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు జాలర్లు చేపలు పట్టడానికి నాటు పడవల్లో వెళ్లేవారు. తర్వాత పెద్ద పెద్ద మర బోట్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద మొత్తంలో చేపలు పట్టగలుగుతున్నారు. 1950ల్లో ఏటా 5 లక్షల 3 వేల మెట్రిక్​ టన్నుల చేపలు మాత్రమే పట్టేవారు. 2017 నాటికి అది కాస్తా 38 లక్షల 3 వేల మెట్రిక్​ టన్నులకు చేరింది. ఇటీవలి వరకు ఈ గ్రోత్​పై కంట్రోల్​ ఉండేది కాదు. ఫలితంగా పడవల్లో కెపాసిటీకి మించి ఫిషింగ్​ జరిపేవారు. కొన్ని జాతుల చేపలనే టార్గెట్​ చేసి వాటినే ఎక్కువ పట్టేవారు. దీనికితోడు ఫిషింగ్​ విషయంలో అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తేవి. అయితే కొన్నేళ్లుగా చేపల దిగుబడి తగ్గిపోయింది. ముఖ్యంగా పిల్ల చేపల ఉత్పత్తి ఊహించని రీతిలో పడిపోయింది. దీనిని కంట్రోల్​ చేసి, చేపల వేటను స్థిరమైన వృత్తి​గా మార్చటానికి సముద్ర తీర రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా నియంత్రణ కోసం ఒత్తిడి తెచ్చాయి.

వానా కాలంలో వేట నిషేధం

చేపలకు బ్రీడింగ్​ టైమ్​లో సంతానం పెరగటానికి, జాలర్ల సేఫ్టీ కోసం వానా కాలంలో షిఫింగ్​పై నిషేధం అమల్లో ఉంది. దీన్ని చాలాసార్లు ఉల్లంఘిస్తుంటారు. దీంతో చేప పిల్లల సంఖ్య తగ్గిపోసాగింది. చేప కమర్షియల్​గా లాభదాయకమైన సైజులోకి ఎదగకుండానే వేటాడేస్తున్నారు. చేపల వేటను ఎవరికివారు ఇష్టమొచ్చిన రీతిలో చేయకుండా తీర ప్రాంత రాష్ట్రాలు ఈమధ్య కొన్ని చర్యలు చేపట్టాయి. ఫిషింగ్​పై వర్షా కాలంలో అమలు చేస్తున్న నిషేధాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి రూల్స్​ ప్రవేశపెట్టాయి. చేపలు పట్టేందుకు వాడే వలల మెష్ (అల్లిక)​ సైజు పెంచకుండా కంట్రోల్​ చేశాయి. బుల్​ ట్రాలింగ్​పైనా నియంత్రణ విధించాయి.

చిక్కటి వలలకు చిక్కని చేపంటూ లేదు

బుల్​ ట్రాలింగ్​లో చేపలు పట్టే వలలు చిక్కగా ఉంటాయి. చేపల కోసం వల విసిరి లాగితే ఆ పరిధిలో నీటి అడుగు భాగంలో ఉన్న ప్రతి పదార్థమూ పైకి వచ్చేస్తుంది. బ్రీడింగ్​ టైమ్​లో చాలా చిన్న సైజులో ఉండే చేపల గుడ్లు కూడా మిస్​ కావు. గుడ్డు స్థాయి నుంచే చేపలను వేటాడటం వల్ల వాటి సంతానం పెరగట్లేదు. చేపల దిగుబడి తగ్గిపోవటానికి ఇదొక కారణమని దక్షిణాది రాష్ట్రాలు గుర్తించాయి. ఈ తరహా చేపల వేటకు అడ్డుకట్ట వేయటానికి ఆయా రాష్ట్రాలు పోరాడుతున్నాయి. గతంలో తీరం నుంచి సముద్రంలోకి పరిమిత దూరంలో, చిన్న పడవలతో ఫిషింగ్​ చేసేవారు. కానీ ఇప్పుడు పెద్ద వలలు అమర్చిన బోట్లు వాడుతున్నారు. దీంతో కేంద్రం 2017లో మెరైన్​ ఫిషరీస్​ పాలసీని తెచ్చింది. ప్రత్యేకంగా ఫిషరీస్​ మినిస్ట్రీని ఏర్పాటుచేసి, గిరిరాజ్​ సింగ్​ని తొలి మంత్రిగా నియమించారు నరేంద్ర మోడీ.

రొయ్యల పెంపకానికి దెబ్బ

ఈ నియంత్రణ ఒక రకంగా చేపల ఎదుగుదలకు, జాలర్లకు కమర్షియల్​గా లాభాలు తేవడానికి ఉపయోగపడినా, మరో రకంగా దెబ్బ కొట్టింది. కేరళలో పిల్ల చేపలు దొరక్కపోవటంతో కర్ణాటక, తమిళనాడుల్లోని ఫిష్​మీల్​ ఇండస్ట్రీపై దెబ్బ పడింది. రొయ్యల పెంపకానికి హైక్వాలిటీ పిల్ల చేపలనే వాడతారు. రొయ్యల పరిశ్రమ నుంచి డిమాండ్​ పెరగటంతో మళ్లీ జాలర్లు పిల్ల చేపల్ని వేటాడేయడం ముమ్మరం చేశారు.

40 లక్షల మందికి ఇదే ఆధారం

మన దేశంలో ఫిషరీ​ సెక్టార్​పై ఆధారపడి బతుకుతున్నవారి సంఖ్య 40 లక్షలు. ఇందులో పది లక్షల మంది జాలర్లు రెగ్యులర్​గా చేపల వేటకు వెళుతుంటారు. మన సముద్రాలు మత్స్య సంపదకు పెట్టింది పేరు. ఒక ట్రాల్​ దూరంలోనే 400లకు పైగా జాతుల చేపలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో ఏటా 44 లక్షల మెట్రిక్​ టన్నుల చేపలు దొరుకుతాయని అధికారిక అంచనా. ఇండియా సముద్ర ఎగుమతులు 2017–18లో 7 బిలియన్​ అమెరికన్​ డాలర్లు దాటాయి. ఈ ఎక్స్​పోర్ట్​లు 1971లో 5 మిలియన్​ అమెరికన్​ డాలర్లు మాత్రమే.

Latest Updates