మెడికల్ కాలేజీలుగా పెద్దాస్పత్రులు

  • ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచనున్న కేంద్రం
  • రాష్ట్రంలో కరీంనగర్‌‌, ఖమ్మం దవాఖానాలకు చాన్స్!
  • అవసరమైన నిధుల్లో 75% ఇవ్వనున్న సెంట్రల్ సర్కార్
  • ఇప్పటికే రెండు దశల్లో 82 దవాఖానాల గుర్తింపు
  • తాజాగా మరో 75 కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‌, వెలుగు: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సర్కారు మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా దవాఖానాలను దశలవారీగా మెడికల్‌ కాలేజీలుగా మార్చేందుకు సిద్ధమైంది. తొలి రెండు దశల్లో 82 దవాఖానాలను కాలేజీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన కేంద్రం.. తాజాగా మరో 75 కాలేజీల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు నిబంధనలను విడుదల చేసి, రాష్ట్రాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అందులో తెలంగాణ నుంచి కరీంనగర్‌‌, ఖమ్మం జిల్లా హాస్పిటళ్లను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ను కలిశారు. కాలేజీలుగా మార్చేందుకు ఈ రెండు హాస్పిటళ్లకు ఉన్న వనరులను, అవసరాన్ని తెలియజేస్తూ ఓ నివేదిక సమర్పించారు. ఈటల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికారులు చెబుతున్నారు. పెద్దాస్పత్రులను మెడికల్​ కాలేజీలుగా మార్చడానికి అవసరమైన నిధుల్లో 75 శాతం కేంద్రమే భరిస్తుంది. ఆయా రాష్ట్రాలు మిగతా 25 శాతాన్ని భరించాల్సి ఉంటుంది.

ఆ రెండు హాస్పిటళ్లే ఎందుకు?

ప్రస్తుతం మెడికల్  కాలేజీలు లేని జిల్లాల్లో మాత్రమే కొత్తవాటి ఏర్పాటుకు సహకరించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌, వరంగల్‌, మెదక్‌ (సిద్దిపేట) జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేటల్లోనూ ప్రారంభమయ్యాయి. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేనిది కరీంనగర్‌‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే. అయితే, రంగారెడ్డి జిల్లాలో ఆరేడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, పక్కనే ఉన్న హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ కాలేజీలున్నాయి. దీంతో కరీంనగర్‌‌, ఖమ్మం జిల్లా దవాఖానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా కనీసం 300 బెడ్లు ఉన్న హాస్పిటల్‌  తప్పనిసరి. ఈ రెండు దవాఖానాల్లో 400కుపైగా బెడ్లు ఉన్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలిపి సుమారు 65 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా ఖమ్మం, కరీంనగర్ దవాఖానాలు మెడికల్​ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు అర్హమైనవేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఖమ్మంలో ఒకటి, కరీంనగర్‌‌లో రెండు  ప్రైవేటు మెడికల్​ కాలేజీలు ఉన్నాయి. దీంతో ఈ జిల్లాలకు అవకాశం వస్తుందా, లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

ఆరు లక్షల మంది డాక్టర్లు కావాలె..

ఇండియాలో ఆరు లక్షల మంది డాక్టర్ల కొరత ఉన్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌, పాలసీ (సీడీడీఈపీ)’ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడే ఉన్నట్టు అంచనా వేసింది. మొత్తంగా చూసినా ప్రతి 15 వందల మందికి ఒక డాక్టరే ఉన్నట్టు తేల్చింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం కనీసం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్‌‌ ఉండాలి.

దేశవ్యాప్తంగా 536 మెడికల్ కాలేజీల్లో కలిపి 79,627 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిల్లోఏటా 50 వేల నుంచి 60 వేల మంది మాత్రమే డాక్టర్ పట్టా సాధిస్తున్నారు. ఇక ఉన్న సీట్లలో సగం వరకు ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెంచితే… పేద మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను అందించడంతోపాటు, డాక్టర్ల కొరతనూ అధిగమించొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

Latest Updates