మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు

ఆరు పంటలకు ఎంఎస్‌పీని పెంచిన కేంద్రం

లోక్ సభలో ప్రకటించిన వ్యవసాయ మంత్రి
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకేనని వెల్లడి

న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన అగ్రి బిల్లులతో రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రద్దు అవుతుందన్న ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమతో సహా ఆరు రబీ పంటలకు ఎంఎస్పీని ప్రకటించింది. గోధుమ, మసూర్ దాల్, శనగ, బార్లీ, కుసుమ, ఆవ పంటలకు ఎంఎస్ పీని పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోక్ సభలో వెల్లడించారు. 2020–21 క్రాప్ ఇయర్ (జులై–జూన్), 2021–22 మార్కెటింగ్ సీజన్ కు గాను ఈ ఆరు పంటలకు ఎంఎస్ పీని పెంచుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ (సీసీఈఏ) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎంఎస్ పీ విధానం ఇకముందూ కొనసాగుతుందని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ప్రభుత్వం రబీ పంటలకు ఎంఎస్ పీని ప్రకటించిందని తోమర్ స్పష్టం చేశారు. గోధుమకు ప్రొడక్షన్ కాస్ట్ కంటే 106% ఎక్కువగా ఎంఎస్ పీ ఉందని, అలాగే శనగలకు 78%, బార్లీకి 65%, ఆవ పంటకు 93%, మసూర్ దాల్ కు 78%, కుసుమలకు 50% ఎక్కువగా ఎంఎస్ పీని ప్రభుత్వం ప్రకటించిందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఏ పంటకు ఎంత పెరిగింది..

గోధుమ ఎంఎస్పీని రూ. 50 పెరిగి, క్వింటాలు ధర రూ. 1,975కు చేరింది.

శనగలకు ఎంఎస్పీ రూ. 225 పెరిగి, క్వింటాలు ధర రూ. 5100కు చేరింది.

బార్లీకి ఎంఎస్పీ రూ. 75 పెరిగి, క్వింటాలు ధర రూ. 1,600కు చేరింది.

మసూర్ దాల్ కు ఎంఎస్పీ రూ. 300 పెరిగి, క్వింటాలు ధర రూ. 5,100కు చేరింది.

ఆవ పంటకు ఎంఎస్పీ రూ. 225 పెరిగి, క్వింటాలు ధర రూ. 4,650కి చేరింది.

కుసుమలకు ఎంఎస్పీ రూ. 112 పెరిగి, క్వింటాలు ధర రూ. 5,327కు చేరింది.

కోట్లాది రైతులకు బెనిఫిట్: ప్రధాని మోడీ

ఆరు రబీ పంటలకు ఎంఎస్ పీని పెంచడం చరిత్రాత్మక నిర్ణయమని, కోట్లాది మంది రైతుల ఎంపవర్ మెంట్ కు, వారి ఆదాయం రెట్టింపు అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయడం తమ ప్రభుత్వానికి గర్వకారణమని ఆయన అన్నారు. ‘‘ఎంఎస్ పీ పెరుగుదల రైతులను ఎంపవర్ చేస్తుంది. వారి ఆదాయం రెట్టింపు అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఎంఎస్ పీని పెంచడంతో పాటు పార్లమెంటు ఆమోదించిన అగ్రికల్చర్ రిఫామ్స్ రైతుల డిగ్నిటీని, సంపదను పెంచుతాయి. జై కిసాన్!” అని మోడీ సోమవారం ట్వీట్ చేశారు.

రైతుల సంతోషానికి వాళ్లు వ్యతిరేకం: అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చేపట్టిన అగ్రికల్చర్ రిఫామ్స్ ను వ్యతిరేకించేవాళ్లు రైతుల సంతోషానికి, వాళ్ల పంటలకు నిజమైన విలువ పొందడానికి వ్యతిరేకులని విమర్శించారు. మోడీ సర్కార్ ప్రతి రోజూ, ప్రతి క్షణం రైతులు, పేదల సంక్షేమం కోసమే పని చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. రైతులను రెచ్చగొడుతున్నవారు అధికారం ఉన్నప్పుడు 2009 నుంచి 2014 మధ్య 1.25 లక్షల టన్నుల పప్పుధాన్యాలు కొనగా, మోడీ సర్కార్ 2014 నుంచి 2019 మధ్య 76.85 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు కొన్నదని పేర్కొన్నారు.

For More News..

ఇండియన్ నేవీ చరిత్రలో తొలిసారిగా..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్ధాకపూర్

Latest Updates