వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్య‌త ‌కేంద్ర ప్రభుత్వానిదే

వలస కార్మికులు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లాలని కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించడం పట్ల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఘాటుగా స్పందించారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలను వారి గమ్య స్థానాలకు చేర్చే బాధ్య‌త‌ను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. గురువారం సనత్ నగర్ నియోజక వర్గంలోని బన్సీలాల్ పేట్ లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. వ‌ల‌స కార్మికుల విష‌యంలో గాలి మాటలు కాకుండా, కేంద్ర ప్ర‌భుత్వం ఏదైనా నిర్ధిష్ట‌‌ నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు..

కేంద్ర ప్ర‌భుత్వ‌ ప్ర‌క‌ట‌న‌లో గమ్యస్థానాలకు ఎలా వెళ్ళాలి అనే విష‌యం నిర్దిష్టoగా లేదన్నారు మంత్రి . హైదరాబాద్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ వాసులు అక్కడికి వెళ్ళాకంటే కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. అంత దూరం వారు ఎలా వెళతారు? వారి ప్రయాణ చార్జీలు ఎవరు భ‌రిస్తారని మంత్రి ప్రశ్నించారు. ఒక స్పష్టతతో ముడు రోజుల పాటు లాక్ డౌన్ ఎత్తివేసి, అన్ని రైళ్లను నడిపించి వారి వారి గమ్యస్థానాలకు ఉచితంగా చేరవేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విషయంలో మన మంచి చెడులు చూసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, ఆయ‌న అన్ని పరిశీలించి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని త‌న సందేశంలో ప్రకటిస్తారని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు.

Latest Updates