సర్కారు, ఆర్టీసీ నడుమ కేంద్రం

  • లేఖల మీద లేఖలు రాసి కేంద్రాన్ని లాగిన రాష్ట్ర సర్కారు
  • ఏపీఎస్​ఆర్టీసీ విభజన జరిగేదాకా కేంద్రం జోక్యం తప్పదు
  • టీఎస్ ఆర్టీసీకి ఎలాంటి ఆస్తులు లేవు
  • ఇప్పటివరకు ఇచ్చిన లీజులపై అనుమానాలు
  • వాటిని రద్దు చేయాలని కేంద్రం చెబితే తలనొప్పులే
  • సంస్థపై ఇన్నాళ్లూ తీసుకున్న నిర్ణయాల చెల్లుబాటుపైన డౌట్స్​

అక్టోబర్​ 5న ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి టీఆర్​ఎస్​ సర్కార్​ తీరుపై మండిపడుతున్నాయి. కార్మికులకు అండగా ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. వీటిని తిప్పికొట్టే క్రమంలో ఆర్టీసీలో 33శాతం కేంద్రం వాటా కూడా ఉందని, నష్టాలను కేంద్రం కూడా భరించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని వివరిస్తూ కేంద్ర  రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి  సీఎం అక్టోబర్​లో లేఖ రాశారు. ఈ నెల 2న కేబినెట్ భేటీ తర్వాత సీఎం మాట్లాడుతూ ‘‘ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. ఆదుకునేందుకు కేంద్రం ఏం చేయలేదు. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలని కోర్టు అడిగినప్పుడు కేంద్రాన్ని కూడా అడగాల్సి ఉంటుందని చెప్తున్నం. సంస్థ నష్టాల్లో ఉంది.. వీటిని మీరు కూడా భరించాలని కేంద్రాన్ని అడుగుతం” అని అన్నారు.  రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కూడా గడ్కరీకి లేఖ రాశారు. సంస్థను  ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అందులో ప్రస్తావించారు. కేంద్ర రవాణా శాఖ సెక్రటరీకి రాష్ట్ర రవాణా శాఖ సెక్రటరీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు.

ఇదే క్రమంలో ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా  కేంద్రానికి సంస్థలో వాటా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టు దృష్టికి తేవడంతో కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఇలా ఇటు రాష్ట్ర ప్రభుత్వ లేఖలు.. అటు కోర్టు నోటీసులతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర జోక్యంతో పరిస్థితులు ఎటు దారితీస్తాయోనని రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలవరపడుతున్నారని ఓ అధికారి అన్నారు ‘‘చాలా పొరపాటు జరిగింది. ఏదో అనుకుని కేంద్రానికి లేఖలు రాస్తే అసలుకే ఎసరు పడేలా ఉంది.  స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చాన్స్​ ఇచ్చినట్లయింది. లేఖలు రాయకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆస్తులన్నీ ఏపీఎస్ ఆర్టీసీవే

రాష్ట్ర విభజన చట్టం 9వ షెడ్యూలు కింద 91 కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. సెక్షన్ 53 ప్రకారం ఆ సంస్థల విభజన బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ద్వారా జరగాలని చట్టం చెబుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీతో సంప్రదింపులు జరిపి సంస్థల విభజన కోసం షీలా బిడే కమిటీని  కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని సంస్థల విభజన ప్రక్రియ చేపట్టగా.. ఏపీఎస్ ఆర్టీసీ అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్​లో ఉన్న విలువైన ఆర్టీసీ ఆస్తుల్లో తమకు కూడా వాటా ఉందని, వాటిని 42 :58 నిష్పత్తి ప్రకారం పంచాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. బస్ భవన్, దాని దగ్గర్లో ఉన్న సుమారు పది ఎకరాల ఖాళీ స్థలం, ఆర్టీసీ కల్యాణ మండపం, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, మెట్టుగూడలోని గెస్ట్ హౌస్, హైదరగూడలోని గెస్ట్ హౌస్, మియాపూర్ లోని బస్ బాడీ యూనిట్, హకీంపేటలోని ట్రైనింగ్ సెంటర్​ ఇలా ఆర్టీసీ ఆస్తుల్లో తమకు వాటా ఉందని ఏపీ డిమాండ్  చేస్తోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆర్టీసీ విభజన పెండింగ్ లో పడిపోయింది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి రాని సంస్థల విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే వెసులుబాటు రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఏపీఎస్​ఆర్టీసీ విభజన పెండింగ్​లో పడటంతో తాత్కాలికంగా రెండు రాష్ట్రాలు విడివిడిగా ఆర్టీసీ బస్సులను మౌఖిక ఒప్పందం మేరకు నడిపించుకుంటున్నాయని ఓ అధికారి చెప్పారు. అంతే తప్ప అటు ఏపీకి గానీ.. ఇటు తెలంగాణకు గానీ ఏపీఎస్​ఆర్టీసీపై పూర్తిస్థాయి హక్కులు లేవని, సంస్థ ఆస్తులను అమ్మలేవని, లీజుకు ఇచ్చే అధికారం కూడా లేదని ఆయన వివరించారు. ఆస్తులన్నీ ఏపీఎస్​ ఆర్టీసీ పేరు మీదనే ఉన్నాయని, టీఎస్​ ఆర్టీసీకి చట్టబద్ధతే లేదని పేర్కొన్నారు.

కాగితాల మీదే టీఎస్​ ఆర్టీసీ

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విడివిడిగా బస్సులను నడిపించడం మొదలుపెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న  ఆర్టీసీ ఎండీ పర్యవేక్షణలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహణ కొనసాగింది. అప్పట్లోనే జేఎండీ రమణారావుకు తెలంగాణ రాష్ట్రంలోని బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అటు తర్వాత కొన్ని నెలలకు సోమారపు సత్యనారాయణను ఆర్టీసీ చైర్మన్ గా నియమించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయానికి వచ్చారు. అయితే.. ‘రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థనే లేదు. తాత్కాలికంగా బస్సులు మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఆర్టీసీ చైర్మన్​ను ఎలా నియమించేది?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు కేంద్ర  రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ యాక్టు 1950   తెరమీదికి వచ్చింది. ఆ యాక్టులోని సెక్షన్ 3 కింద  ప్రతి రాష్ట్రం సొంతంగా ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ చట్టం ప్రకారం 2016 ఏప్రిల్ లో టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేసి సోమారపు సత్యనారాయణను చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ‘‘టీఎస్ ఆర్టీసీకి సొంతంగా ఆస్తులు లేవు. కేవలం కాగితాల మీద మాత్రమే సంస్థ ఏర్పడింది. విభజన పూర్తయ్యే వరకు  రెండు రాష్ట్రాల్లో ఉన్న బస్సులు, డిపోలు, బస్టాండ్ లు తాత్కాలిక పద్ధతిన ఉపయోగించుకుంటున్నారు’’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కొన్నాళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను ప్రోత్సహించేందుకు రెండు రాష్ట్రాలకు బస్సులను ఇచ్చింది. అవి ఆర్టీసీ సంస్థలకు ఇవ్వలేదు. ప్రభుత్వాలకు మాత్రమే ఇచ్చింది. వాటిని ఆర్టీసీకే ఇవ్వాలనే నిబంధనలేదు. ‘‘అందుకే తాజాగా కేంద్రం ఇచ్చిన 40 ఎలక్ట్రిక్‌‌  బస్సులను  తెలంగాణ ప్రభుత్వం ఒలెక్ట్రా (మేఘా కంపెనీ) అనే ప్రైవేటు కంపెనీకి  ఇచ్చింది’’ అని ఓ అధికారి చెప్పారు. ఈ కారణం వల్లే కేంద్రం ఎలక్ట్రిక్‌‌ బస్సుకు రూ. కోటి చొప్పున ఇచ్చిన సబ్సిడీ కూడా  ఒలెక్ట్రా ఖాతాలోకి పోయాయి. పెట్టుబడి పెట్టింది రాష్ట్ర సర్కారైనా ఆర్టీసీకీ సొంత బస్సులు కాకుండా హైర్‌‌ బస్సులుగా  ఎలక్ట్రిక్‌‌ బస్సులు ఇవ్వడం వివాదంగా మారింది.

లీజుల పరిస్థితి ఏంది?

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏదైనా సంస్థ విభజన పూర్తయ్యే వరకు ఆ సంస్థలోని ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం విలువైన ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చింది. ‘‘ఈ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదు. లీజు వ్యవహారంపై రాష్ట్రాన్ని కేంద్రం ప్రశ్నించే అవకాశం ఉంది’’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అనవసరంగా లేఖలు రాసి కేంద్రాన్ని ఆర్టీసీ అంశంలోకి లాగి  రాష్ట్ర ప్రభుత్వం ఇరుక్కుపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా ఏపీఎస్​ ఆర్టీసీ  విభజన జరుగనప్పుడు దాని ఆస్తులు ఎలా లీజుకు ఇచ్చారని కేంద్రం ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదని అన్నారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో చాలా ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చారు. హన్మకొండలోని 2 ఎకరాల్లో ఉన్న టైర్ రిట్రెడింగ్ యూనిట్ స్థలం, హన్మకొండ లోని రాంనగర్ లో ఉన్న స్టాఫ్​ క్వార్టర్స్, వరంగల్ పాత బస్టాండ్ దగ్గర ఉన్న స్థలం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, సిద్దిపేట, తొర్రూరు, మంచిర్యాల, నారాయణపేట ఇలా చాలా చోట్ల ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చారు. ఇవి కూడా చాలా వరకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబీకులకు,  బంధువులు, అనుచరులకే అప్పగించారు. కేంద్రం అనుమతి లేకుండా ఇదంతా జరిగింది. ఆర్టీసీలో తమకు వాటా ఉన్నందున.. లీజులు రద్దు చేయాలని కేంద్రం ఆదేశించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీలోని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్ ఇస్తూ రాష్ట్ర కేబినెట్​ ఇచ్చిన నిర్ణయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గత నిర్ణయాలపై కూడా కేంద్రం జోక్యం చేసుకునే చాన్స్​ ఉందని అన్నారు. ఆర్టీసీ విభజన జరిగే వరకు అందులో కల్పించుకునే అధికారం చట్టం ప్రకారం కేంద్రానికి ఉందని చెప్పారు.

కోర్టు స్టే ఎట్లిస్తది? : సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు: రూట్ల ప్రైవేట్​ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడంపై సీఎం కేసీఆర్​ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పర్మిట్లపై అసలు తాము ఏం నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి తీర్మానం పాస్‌‌ చేయలేదని, అలాంటిది కోర్టు ఎలా స్టే ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. శుక్రవారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గురు, శుక్రవారాల్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. సోమవారం కోర్టులో సమర్పించాల్సిన అఫిడవిట్‌‌పై, న్యాయపరంగా ఎలా ఫేస్‌‌ చేయాలనే అంశాలపై డిస్కస్‌‌ చేశారు. ఒక వేళ  హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా  వస్తే సుప్రీంకోర్టు పోదామని సీఎం సూచించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్‌‌ బస్సులకు పర్మిట్లు రెండూ కోర్టులో ఉండిపోయాయని, వాటిపై ఏమీ చేయలేమని, వీటిపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నట్లు తెలిసింది.

ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీకి పీఎఫ్ కమిషనర్ నోటీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్‌‌) బకాయిల విషయంలో ఆర్టీసీ ఇన్‌‌చార్జి ఎండీ సునీల్‌‌ శర్మకు పీఎఫ్‌‌ రీజినల్‌‌ కమిషనర్‌‌ శుక్రవారం నోటీసులు పంపారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో రూ.760.62 కోట్లు జమ చేయనట్లుగా తమ దృష్టికి వచ్చిందని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే సీసీఎస్‌‌, ఎఫ్‌‌ఆర్‌‌బీఎం నిధులు వాడుకుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో కార్మికుల పీఎఫ్‌‌ డబ్బులు వాడుకుంది. అయితే గతంలోనూ రెండు సార్లు పీఎఫ్‌‌ అధికారులు ఆర్టీసీకి నోటీసులు పంపించారు. ఆ మేరకు ఆర్టీసీ అధికారులు కొంత మేర చెల్లించి, రిక్వెస్ట్‌‌ చేయడంతో పీఎఫ్ రీజినల్ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేశారు. ఈ మధ్య ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా..అధికారులు పీఎఫ్‌‌ డబ్బులు వాడుకున్నారని పదేపదే ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎఫ్‌‌ ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీకి తాజా నోటీసులతో మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో ఏర్పడినట్లైంది.

Latest Updates