ఆన్‌లైన్ కంపెనీలకు కేంద్రం హుకుం

ఫారిన్ పెట్టుబడులపై రిపోర్టు ఏటా ఇవ్వాల్సిందే..

న్యూఢిల్లీ: దేశంలోని చిన్న వ్యాపారుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఎఫ్‌‌డీఐ కంప్లయెన్స్‌ రిపోర్టును ఏటా తప్పనిసరిగా ఇవ్వాలని ఆన్‌‌లైన్‌‌ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ ఏడాది సెప్టెంబర్‌‌ 30లోగా స్టాట్యుటరీ ఆడిటర్ ఈ కంప్లయెన్స్‌ రిపోర్టును అందచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫారిన్‌‌ డైరెక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ (ఎఫ్‌‌డీఐ) విధానంలోని నిబంధనలు అన్నింటినీ ఈ కంపెనీలు సక్రమంగా నెరవేర్చేలా చూసేందుకే ప్రభుత్వం తాజా చర్య ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్‌‌ 30లోగా స్టాట్యుటరీ ఆడిట్‌‌ రిపోర్టును తప్పనిసరిగా ఆన్‌‌లైన్ కంపెనీలు అందించాలని స్పష్టం చేసింది. ఎఫ్‌‌డీఐ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు చెబుతూ ఈ రిపోర్టు ఇవ్వాలని పేర్కొంది. ఈ–కామర్స్‌ రంగంలో ఎఫ్‌‌డీఐ నిబంధనలు అమలయ్యేందుకు తాజా నిర్ణయం సాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐతే, ఈ చర్య వల్ల ఆయా కంపెనీలకు కంప్లయన్స్‌ వ్యయం మాత్రం పెరుగుతుంది. ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు ఎఫ్‌‌డీఐ నిబంధనలు పాటించడం లేదంటూ గత కొన్ని నెలలుగా దేశీయ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ–కామర్స్‌ రంగ ఎఫ్‌‌డీఐ నిబంధనలలో తాజా మార్పులలో కొన్నింటిని మార్చాలనే గ్లోబల్‌‌ కంపెనీలు, అమెరికా ఇండస్ట్రీ ఛాంబర్స్‌‌ల ఒత్తిడికి తలొగ్గ వద్దని కూడా కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆల్‌‌ ఇండియా ట్రేడర్స్‌ (సెయిట్‌‌) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. డీప్‌‌ డిస్కౌంట్లతో తక్కువ ధరలకే ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు తమ ప్రొడక్స్‌ట్‌ను అమ్మడాన్నీ సెయిట్‌‌ వ్యతిరేకిస్తోంది. ఇందులో ఆ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్‌‌ సేల్స్‌‌లో ఆ కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తోంది. ఎఫ్‌‌డీఐ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌‌ ఆన్‌‌లైన్‌‌ కంపెనీలను హెచ్చరించారు. నవంబర్‌‌ నెలలో అమెజాన్‌‌ ఇండియా హెడ్‌‌ అమిత్‌‌ అగర్వాల్‌‌– పీయూష్‌ గోయెల్‌‌ల మధ్య మీటింగ్‌‌లోనూ ఇది చర్చకు వచ్చింది.

Latest Updates