కరోనా వైరస్.. విపత్తు: మృతులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం

కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందు కోసం కరోనాను విపత్తుగా నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి పరిహారం అందించేందుకు వెసులుబాటు కల్పించింది కేంద్ర హోం శాఖ.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో దీనిని విపత్తుగా నోటిఫై చేయాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్‌లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. నియంత్రణ చర్యలకు, బాధితులకు సహాయం అందించేందుకు వీలుగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు కేంద్ర విపత్తు నిర్వహణ విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామన్నారు.

మార్గదర్శకాలు

  • కరోనాతో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం అందిస్తారు. అయితే వైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్య అధికారుల నుంచి డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి.
  • కరోనా నియంత్రణ చర్యలు, హాస్పిటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్ల కోసం రాష్ట్రాలకు విపత్తు నిధి నుంచి సాయం.
  • అవసరమైన మేర తాత్కాలిక క్వారంటైన్ క్యాంపుల ఏర్పాటుకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు నిర్ణయం తీసుకునే అధికారం. పరిస్థితులను బట్టి వాటిని ఎన్నాళ్లు కొనసాగించాలన్నది కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు.
  • ఎస్డీఆర్ఎఫ్ కింది ఇచ్చే ఏడాది మొత్తానికి కేటాయించే నిధుల్లో 25 శాతం వరకు ఖర్చు పెట్టే అవకాశం. ఆస్పత్రుల్లో క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్ల ఫుడ్, దుస్తులు, మెడికేషన్ వంటి అవసరాలకు ఈ నిధుల వినియోగం.
  • కరోనా స్క్రీనింగ్, టెస్టులు, అనుమానితుల ట్రాకింగ్‌, చికిత్సకు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి సాయం.
  • కరోనా టెస్టుల కోసం అదనపు ల్యాబ్స్ ఏర్పాటు, వైద్య, మున్సిపల్, పోలీస్, ఫైర్ సిబ్బందికి మాస్కులు, సూట్లు వంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యూప్‌మెంట్, థర్మల్ స్కానర్లు, వెంటిలేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఇతర అవసరాల కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్‌ కింది ఏడాదికి కేటాయించిన నిధుల్లో పది శాతం మించకుండా నిధులను వాడుకునే వీలు.

Latest Updates