కేసీఆర్ ఆస్తులతో పాటు.. రాష్ట్ర అప్పులూ పెరిగినయ్

హైదరాబాద్: కేసీఆర్‌‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లేనని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ ఆస్తులు పెరిగాయని.. అలాగే తెలంగాణ రాష్ట్ర అప్పులూ పెరిగాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్ షీట్‌‌ను ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదని విమర్శించారు. హుస్సేస్ సాగర్‌‌‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా?. హుస్సేన్ సాగర్ వైపు పోతే కంపు కొడుతోందని పేర్కొన్నారు.

‘సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాల మధ్య ఉన్న దుబ్బాకలో బీజేపీ హవా చూపించింది. ఇదే హవా బల్దియా ఎలక్షన్స్‌‌లోనూ కొనసాగుతుంది. హైదరాబాద్ మేయర్ పీఠం మీద ఎంఐఎం మేయర్ కూర్చోవాలా? లేదా బీజేపీ మేయర్ కావాలా?. ఈ ప్రశ్న మీదే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్‌‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లే. కాంగ్రెస్‌‌‌కు ఓటేసినా ఎంఐఎంకు ఓటేసినట్లే. అదే ఎంఐఎంకు ఓటేస్తే డివిజన్ (చీలిక)కు ఓటేసినట్లే. అందుకే బీజేపీకి మేయర్ పీఠం ఇవ్వాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించారు. ఒకే కుటుంబం పాలన సాగిస్తుండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎంఐఎం కూడా ఒక కుటుంబ పార్టీనే. అక్కడ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు.. ఇక్కడ అసదుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలు ఉన్నారు. ఈ పార్టీలు గత ఆరేళ్లలో ప్రజలను దోచుకున్నాయి. తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది. కేసీఆర్‌‌ ఫ్యామిలీతోపాటు ఆయన సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అప్పులు పెరుగుతుండటం గమనార్హం. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఆరేళ్లలో నిలబెట్టుకోలేకపోయింది. హైదరాబాద్‌‌ను డల్లాస్, ఇస్తాంబుల్‌‌లాగా గ్లోబల్ సిటీ చేస్తామని చెప్పి వరదల నగరంగా మార్చారు. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. లక్ష మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి దిక్కు లేకుండా పోయింది’ అని జవదేకర్ వివరించారు.

Latest Updates