టిమ్స్ ను సందర్శించిన కేంద్ర పర్యవేక్షక బృందం

గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజు కూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఉన్నత స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది సెంట్రల్ మానిటరింగ్ టీం. ఇవాళ(సోమవారం) గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించింది. టిమ్స్ లోని ఐసోలేషన్, ఐసీయూ రూమ్ లను అధికారులు పరిశీలించారు.

హైదరాబాద్ లోని కంటైన్మెంట్ జోన్లను, గాంధీ ఆస్పత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించనుంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, వారికి సమకూర్చిన సదుపాయాలు, ఆస్పత్రిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది పనితీరు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించనుంది. ఆ తర్వాత బీఆర్కే భవన్ లో మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ కానుంది సెంట్రల్ మానిటరింగ్ టీం.