కాలుష్యానికి కారణమైతే ఐదేళ్లు జైలు లేదా రూ.కోటి ఫైన్​​!

  •     కొత్త కమిషన్​ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్
  •     హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ కమిషన్‌ పరిధిలోకి
  •      మూడేళ్లపాటు పదవిలో చైర్​పర్సన్.. 20మంది సభ్యులు

న్యూఢిల్లీఢిల్లీ, నేషనల్‌ క్యాపిటల్‌‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్‌ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. 20 మంది సభ్యులతో ఏర్పాటయ్యే పర్మినెంట్ కమిషన్.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోనుంది. గురువారం ఈ మేరకు ‘‘కమిషన్​ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్​మెంట్ ఇన్ ఎన్‌సీఆర్‌, అడ్జాయినింగ్ ఏరియాస్ ఆర్డినెన్స్ -2020’’ని మినిస్ట్రీ ఆఫ్ లా, జస్టిస్ రిలీజ్ చేసింది. ఎన్విరాన్​మెంట్ పొల్యూషన్ (ప్రివెన్షన్, కంట్రోల్ అథారిటీ)ని రద్దు చేసి.. ఆ స్థానంలో కొత్త కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఈ ఆర్డినెన్స్​పై ప్రెసిడెంట్ బుధవారమే సంతకం చేశారు. కొత్త రూల్స్ ప్రకారం కాలుష్యానికి కారణమయ్యే వారికి ఐదేళ్ల జైలు లేదా రూ.కోటి ఫైన్​ విధించనున్నారు. లేదా 2 శిక్షలు కలిపి వేస్తారు. ఆర్డినెన్స్​తోపాటే ఇవన్నీ అమల్లోకి వచ్చేశాయి. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీలను కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

20 మంది సభ్యులు..

కమిషన్​లో 20మంది సభ్యులు ఉంటారు. కమిషన్, సబ్ కమిటీల్లో ఢిల్లీ, పక్క రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తారు. చైర్ పర్సన్, ఇతర సభ్యుల పేర్లను కేంద్ర పర్యావరణ మంత్రి ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ రికమండ్ చేస్తుంది. చైర్​పర్సన్ మూడేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు.  కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎన్విరాన్​మెంట్ సెక్రెటరీ రెప్రజెంటేటివ్, ఐదుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఇస్రో నామినేట్ చేసిన ఓ టెక్నికల్ మెంబర్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కు చెందిన టెక్నికల్ మెంబర్, ఎన్జీవోలకు చెందిన ముగ్గురు మెంబర్లు, రోడ్ ట్రాన్స్​పోర్ట్, పవర్, హౌసింగ్, పెట్రోలియం, అగ్రికల్చర్, కామర్స్ మినిస్ట్రీల రెప్రజెంటేటివ్స్, ఎక్స్​పర్టులు సభ్యులుగా ఉంటారు.

మూడు సబ్ కమిటీలు 

కమిషన్​లో 3 సబ్ కమిటీలు ఉంటాయి. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, యూపీలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు 1.మానిటరింగ్, ఐడెంటిఫికేషన్, 2.సేఫ్ గార్డింగ్, ఎన్ఫోర్స్​మెంట్, 3.రీసెర్చ్, డెవలప్​మెంట్ అనే సబ్ కమిటీలు పని చేస్తాయి.

సైకిళ్లు తీయాల్సిన టైం వచ్చింది: సుప్రీం

కాలుష్యాన్ని అరికట్టడానికి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. దీంతో ఆర్డినెన్స్​ తాము పరిశీలిస్తామని బెంచ్ చెప్పింది. ‘‘ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు మేం ఒకసారి ఆర్డినెన్స్​ను పరిశీలిస్తాం. పిటిషనర్లు కూడా ఒకసారి చూడండి. దీనిపై వచ్చే శుక్రవారం (నవంబర్ 6న) విచారణ జరుపుతాం” అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్​ల బెంచ్ చెప్పింది. సైకిళ్లు బయటికి తీయాల్సిన టైం వచ్చిందని, బ్యూటిఫుల్ కార్లను ఉపయోగించడం ఆపాలని కామెంట్ చేసింది.

‘గ్రీన్ ఢిల్లీ’ యాప్ స్టార్ట్ చేసిన కేజ్రీ

కాలుష్యానికి కారణమయ్యే యాక్టివిటీలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ‘గ్రీన్ ఢిల్లీ’ మొబైల్ యాప్​ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. కాలుష్యంపై చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ప్రజల సపోర్ట్ లేకుండా మార్పు సాధ్యం కాదన్నారు. చెత్త కాల్చడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్, దుమ్ము.. తదితర కాలుష్య కారక యాక్టివిటీలను ఫొటోలు లేదా వీడియోలు తీసి యాప్​లో అప్​లోడ్ చేయాలన్నారు.

 

Latest Updates