బీమా కంపెనీలకు 12 వేల కోట్లు?

  • ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజ్
  • మూడు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లింపు 
  • సాల్వెన్సీ రేషియో పెంచేందుకే

బ్యాంకులు మరిన్ని లోన్లు ఇవ్వడానికి రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, బీమా కంపెనీలకు కూడా సాయపడనుంది. నేషనల్‌‌ ఇన్సూరెన్స్‌‌, ఓరియంటల్‌‌ ఇన్సూరెన్స్‌‌, యునైటెడ్‌‌ ఇండియా ఇన్సూరెన్స్‌‌ కంపెనీల మూలధనాన్ని పెంచడానికి, వాటిని ఐఆర్‌‌డీఏ నిబంధనల ప్రకారం నడపడానికి రూ.12 వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మూడు కంపెనీల ఆర్థిక పరిస్థితి మరీ బలహీనంగా ఉండటంతో, సహాయక ప్యాకేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ (డీఎఫ్‌‌ఎస్‌‌) గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చింది. వీటిని విలీనం చేసి ఒకే కంపెనీగా మార్చుతామని గత ఏడాది బడ్జెట్‌‌లో ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ఇబ్బందుల వల్ల విలీనం సాధ్యపడలేదు. కంపెనీల ఆర్థిక పరిస్థితి ఇందుకు ప్రధాన కారణం. లిస్టింగ్‌‌ కాబోయే కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.5 ఉండాలి. మూడింట రెండు కంపెనీలకు ఈస్థాయి సాల్వెన్సీ రేషియో లేదు. తగినంత సాల్వెన్సీ రేషియో ఉంటేనే కంపెనీకి అప్పులు తీర్చే సామర్థ్యం ఉన్నట్టు భావిస్తారు. నేషనల్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.5 ఉన్నప్పటికీ, యునైటెడ్‌‌ ఇండియా రేషియో 1.21కు పరిమితమయింది.

విలీనం ఇక ఈజీ

ఇన్వెస్ట్‌‌మెంట్లను ఉపసంహరించుకోవడంలో భాగంగా ఈ మూడు ప్రభుత్వ ఇన్సూరెన్స్‌‌ కంపెనీలను విలీనం చేయాలని మోడీ సర్కారు కోరుకుంది. విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈవై కంపెనీని కన్సల్టెంటుగా నియమించింది కూడా. ప్రభుత్వం ఇప్పుడు వీటికి రూ.12 వేల కోట్లు ఇవ్వడం వల్ల, ఈ కంపెనీల సాల్వెన్సీ రేషియో ఐఆర్‌‌డీఏ రూల్స్‌‌ ప్రకారం ఉంటుంది. ఫలితంగా మూడు కంపెనీలను విలీనం చేయడానికి ఎలాంటి సమస్యా ఉండదు. వీటిని కలపగా ఏర్పడే కంపెనీ మనదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా అవతరిస్తుందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా న్యూఇండియా అష్యూరెన్స్‌‌ కంపెనీ, జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌ కార్పొరేషన్‌‌లను 2017లో స్టాక్‌‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌‌ చేశారు. దీంతో ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు సమకూరాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లను ఆర్జించాలనేది మోడీ ప్రభుత్వ లక్ష్యం.

ఎగుమతులకు ప్రోత్సాహకాలు

ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో భాగంగా కొన్ని రంగాల ఎగుమతులపెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రకటించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆభరణాలు, విలువైన రాళ్ల ఎగుమతులను పెంచడంపై ఇది వరకే ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలు చర్చించాయి. ఎగుమతుల పెంపునకు ఒక ప్రతిపాదనను కూడా తయారు చేశాయి. దీని ప్రకారం స్పెషల్‌ఎనాకమిక్‌ జోన్స్‌‌ (సెజ్‌ లు)లో నెలకొల్పే కొత్త యూనిట్లకు కూడా పన్ను మినహాయింపులను వర్తింపజేస్తారు. ప్రస్తుతం రూల్స్‌‌ ప్రకారం 2020, మార్చి 31కి ముందు సెజ్‌ లలో ఏర్పాటయ్యే యూనిట్లకు మాత్రమే పన్ను మినహాయింపులు ఉంటాయి. చాలామందికి ఉపాధి కల్పించే రంగురాళ్లు,ఆభరణాలు, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులపై ప్రస్తు తం 7.5 శాతం సుంకం వసూలు చేస్తున్నారు . దీనిని తగ్గించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఎక్స్‌‌పోర్టు క్రెడిట్‌ లో 60 శాతం మొత్తానికి ఇన్సూరెన్స్‌‌ ఉండగా, దీనిని 90 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నా యి. దీని వల్ల బ్యాంకులు మరింత తక్కువ రేటుకు ఎక్స్‌‌పోర్ట్‌ క్రెడిట్‌ ఇస్తాయి. దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు..స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల మీదుగా ఎగుమతుల సరుకులు వెళ్లకుండా చూస్తారు. ఎగుమతులు, దిగుమతులకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు కొత్తవిధానాన్ని తెస్తారు. ఈ ఏడాది జూలైలో ఇండియా నుంచి ఎగుమతుల్లో 2.25శాతం పెరుగుదల నమోదయింది. ఏప్రిల్‌ –జూలై మధ్య మాత్రం వీటి విలువ 0.37శాతం తగ్గి 107 బిలియన్‌‌ డాలర్లుగా నమోదయింది.

Latest Updates