ఖాకీల చేతుల్లో లాఠీలు.. చెడ్డీ గ్యాంగ్ చేతుల్లో రాడ్లు

ఎల్బీ నగర్ (హైదరాబాద్), వెలుగు:

పోలీసులున్నది ముగ్గురు.. చెడ్డీ గ్యాంగ్​లో దానికి డబుల్​. ఖాకీల దగ్గర కేవలం లాఠీలు.. దొంగల ముఠాల చేతుల్లో కర్రలు, రాడ్లు. ఫలితం కళ్లముందే దొంగలున్నా పట్టుకోలేని పరిస్థితి. పరారవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. గురువారం హైదరాబాద్​ హయత్​నగర్​ పరిధిలోని కుంట్లూర్​ శివార్లలో ఉన్న జూబ్లీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్​ చేసిన దోపిడీ ఉదంతంలో కనిపించిన సీన్​ ఇది. నెల రోజుల గ్యాప్​లోనే మరో రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్​. పోలీసులకు బాధితులు ఫోన్​ చేసినా కనీసం ఎత్తలేదు. గంటన్నరకు గానీ అక్కడకు చేరుకోలేదు. వచ్చినా కళ్లముందే పారిపోతున్న ముఠాను పట్టుకోలేకపోయారు. 75 వేల నగదు, 20 తులాల బంగారంతో చెడ్డీ గ్యాంగ్​ ఉడాయించింది. అర్ధరాత్రి 12 గంటల టైంలో సప్పిడి వెంకట్​రెడ్డి అనే వ్యక్తి ఇంటి తలుపులను కర్రలు, రాడ్లతో వచ్చిన ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్​ పగులగొట్టింది. వెంకట్​రెడ్డి కుటుంబ సభ్యులు తేరుకునేలోపే గ్యాంగ్​ ఇంట్లోకి చొరబడింది. వెంకట్​రెడ్డిని మంచంపైనే పడుకోబెట్టి దుప్పటి కప్పేసింది. దుప్పటి తీస్తే చంపేస్తామంటూ ఓ వ్యక్తి రాడ్​ పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. ఎవరైనా వస్తే అలర్ట్​ చేసేందుకు ఇంకో దొంగ బయట నిలబడ్డాడు. మిగతా నలుగురు దుండగులు ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలను కాజేశారు. వృద్ధురాలి చెవికి ఉన్న దిద్దులను లాగడంతో ఆమెకు గాయాలయ్యాయి. 12.22 గంటలకు వెంకట్​రెడ్డి కూతురు సింధు, పోలీస్​ పెట్రోలింగ్​ అధికారులకు ఫోన్​ చేసినా, వాళ్లు ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. దీంతో ఆమె 100కు ఫోన్​ చేసి సమాచారమిచ్చింది. అయినా పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకోలేదు. 40 నిమిషాల పాటు చెడ్డీ గ్యాంగ్​, వెంకట్​రెడ్డి ఇంట్లోనే ఉన్నా రాలేదు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో వెంకట్​రెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న ఐతరాజు శ్రీనివాస్​ అనే ఆర్​ఎంపీ ఇంట్లోకీ ప్రవేశించారు. వెంకట్​రెడ్డి ఇంట్లో చేసినట్టుగానే దోపిడీ చేశారు. ఆ టైంలో పోలీసులు వచ్చారు. అయితే, బయట ఉన్న మరో దొంగ ఆ విషయాన్ని చెప్పడంతో అలర్ట్​ అయిన ముఠా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. పారిపోతూనే ఓ దుండగుడు శ్రీనివాస్​ భార్య మెడలోని పుస్తెల తాడు, చెవి దుద్దులు లాక్కొని పరారయ్యాడు.

ఇంటర్​సెప్టర్​ను ఎందుకు అలర్ట్​ చేయలేదు?

హైవేలతో పాటు శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్​ కోసం ఇంటర్​సెప్టర్​ వాహనాలను ఏర్పాటు చేస్తారు. వారి దగ్గర గన్నులుంటాయి. చోరీ జరిగిన టైంలో ఇంటర్​సెప్టర్​టీంను అలర్ట్​ చేసి ఉంటే దొంగలు దొరికేవారని స్థానికులు చెబుతున్నారు. గ్యాంగ్​ తిరగబడుతుందన్న భయం లేకుండా వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్లంటున్నారు. ఒకవేళ ఇంటర్​సెప్టర్​ టీంను పంపకుంటే, కనీసం ఎస్సై స్థాయి అధికారినైనా పంపి ఉంటే, ఆయన దగ్గరా గన్​ ఉంటుంది కాబట్టి, దొంగలు దొరికిపోయేవారేమోనని అంటున్నారు. ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎల్బీనగర్​ డీసీపీ సంప్రీత్​ సింగ్​, ఏసీపీ జయరాంలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Latest Updates