‘చలో ట్యాంక్‌బండ్’ సక్సెస్

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ ఈ రోజు నిర్వహించిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ విజయవంతమైనదని చెప్పుకోవచ్చు. ట్యాంక్‌బండ్‌‌కు వచ్చే దారులన్నింటిని పోలీసులు మూసివేసినా.. ఆర్టీసీ కార్మికులు మాత్రం అడ్డదారుల్లోనైనా ట్యాంక్‌బండ్‌ చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కార్మికులు ఎవరూ ట్యాంక్‌బండ్ పైకి రాకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దాంతో కార్మికులు ఒక్కొక్కరుగా అందరూ ఒకే దగ్గరికి చేరుకున్నారు. సుమారు 100 నుంచి 200 మంది కార్మికుల వరకు మ్యారియట్ హోటల్ నుంచి, గోశాల నుంచి, DBR మిల్ నుంచి బారికేడ్లను తోసుకుంటూ ఒక్కసారిగా ట్యాంక్‌బండ్ పైకి దూసుకువచ్చారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కొంత మంది కార్మికులపై చెయ్యి కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్‌ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా చెయ్యి చేసుకొని కెమెరాలను లాక్కున్నారు. పోలీసుల తీరును అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా ప్రతినిధులు తప్పుబడుతున్నారు. కార్మికులు ట్యాంక్‌బండ్ పైకి చేరుకున్న తీరు, వాళ్ల నినాదాలు వీటన్నింటిని మొత్తంగా పరిశీలిస్తే ‘చలో ట్యాంక్‌బండ్’ సక్సెస్ అయినట్లుగానే చెప్పొచ్చు.

Latest Updates