యూపీ ఎన్నికల బరిలో బందిపోటు

లక్నో: ఆయన పేరు చెప్తే చంబల్‌ ప్రజలంతా ఒకప్పుడు వణికిపోయేవారు. ఆయన వస్తున్నాడంటే పరుగులు పెట్టేవారు. బందిపోట్ల రాజ్యానికి మకుటం లేని మహారాజులా వెలుగొందిన 76 ఏళ్ల మల్కన్‌ సింగ్‌ రాజ్పుట్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దౌర్‌‌హరా సీటులో ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. ఒకప్పుడు పెద్ద బందిపోటుగా అందరినీ భయపెట్టి, చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న  మల్కాన్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు రెబల్‌గా మారి బందిపోట్ల నుంచి ప్రజలను కాపాడతానని హామీలు ఇస్తున్నారు. బందిపోట్ల స్ట్రాటజీ ఏంటో తనకు బాగా తెలుసని దాంతో వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని అన్నారు. తమ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని, కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. “ నేను ప్రజల పక్షంలో నిలబడతాను. ప్రజలు ప్రతి రోజు బందిపోట్ల వళ్ల ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్లపై, మహిళలపై వారు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతాను. గతంలో చేసిన తప్పులను చేయను” అని హామీ ఇచ్చారు. నేర చరిత్ర గురించి మల్కాన్‌ను మీడియా ప్రశ్నించగా.. తనను తాను కాపాడుకునేందుకు మాత్రమే గన్‌ పట్టుకున్నానని, నిజమైన దొంగలెవరో తనకు తెలుసని వాళ్లతో ఎలా డీల్‌ చేయాలో తెలుసని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని ఎవరు ఎక్కడ  నుంచైనా పోటీ చేయొచని అందుకే తాను దౌర్‌‌హరా నుంచి పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

నేర చరిత్ర..

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్ద బందిపోటుగా మల్కన్‌కు పేరు ఉంది. మొదటిసారి 17ఏళ్ల వయసులోనే ఆర్మ్‌ యాక్ట్‌ కింద ఆయన అరెస్టు అయ్యారు. ఆయన మీద 28 కిడ్నాప్‌ కేసులు, 18 దోపిడీ కేసులు, 19 హత్యాయత్నం కేసులు, 17 మర్డర్‌‌ కేసులు ఉన్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అప్పట్లో ఆయనపై 70వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. దీంతో 1982లో మధ్యప్రదేశ్‌ సీఎం అర్జున్‌ సింగ్‌ ఎదుట మల్కన్‌ లొంగిపోయారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసి జితిన్‌ ప్రసాద గెలుపుకు కారణమైన మల్కన్‌సింగ్‌ ఈ ఎన్నికల్లో బందా స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని అనుకునప్పటికీ సీటు దక్కకపోవటంతో అదే జితిన్‌ ప్రసాదపై పోటీకి నిలబడ్డారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున రేఖా వర్మ, కూటమి తరఫున అర్షద్‌ పోటీలో ఉన్నారు.  ఈ నెల 6న ఈ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

 

 

 

Latest Updates