వర్ష సూచన: రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందన్నారు. అలాగే దీనికి అనుబంధముగా 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వాయువ్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు(బుధవారం) రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇవాళ (మంగళవారం), రేపు( బుధవారం) ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల  భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

Latest Updates