ఐదేళ్లు నీతిగా పాలించాను.. కుప్పంలో చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎన్నికల తర్వాత తొలిసారి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయినప్పటికీ… సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గెలిచారు. అందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. అక్కడ నిర్వహించిన సభలో బాబు మాట్లాడారు. ప్రతిసారి ఎన్నికలు ముగిశాక రామకుప్పం రావడం ఆనవాయితీగా పెట్టుకున్నానని అన్నారు. గెలుపు, ఓటమిలు సాధారణమనీ.. ఎన్నికలకు టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన అన్నారు.

“ఏడు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారంటే.. అది నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానాలకు నిదర్శనం. కుప్పంకు‌ నీరు తెచ్చే వరకూ పోరాడుతాను. ఎన్నికలు జరిగి 40 రోజులు అవుతున్నా.. మన ఓటమి పట్ల ఇంకా టీడీపీ కార్యకర్తలు ఏడుస్తున్నారు. పార్టీ ఎందుకు ఓటమి పాలైంది అని అనేక సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఫలితాలు విశ్లేషణ చేయడంతో పాటు తప్పు, ఒప్పులపై పరిశీలన చేస్తున్నాం. ఐదేళ్ళలో నేను ఎక్కడా తప్పులు చేయలేదు. నీతి వంతమైన పరిపాలన అందించాను. ఆరుగురు కార్యకర్తలను చంపేశారు. అన్నింటిపై పోరాటం చేస్తాను” అన్నారు చంద్రబాబు.

Latest Updates