ఇంతకన్నా బరితెగింపు ఇంకేమైనా ఉందా..?: బాబు

గుంటూరు: పచ్చి అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని సీఎం జగన్ ను ఉద్ధేశించి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తూ.. ‘అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాస్తున్నారా’ అని ముఖ్యమంత్రి అంటారు. ‘దొబ్బేయండి’ అని మంత్రి అంటారు. ఇదేనా ముఖ్యమంత్రి స్థాయి, మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు. ఇదేనా వీరి హుందాతనం..? అంటూ ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులు, కరవు గురించి మాట్లాడాలి. కాని అది తప్ప అన్ని విషయాలు మాట్లాడారని ఆయన అన్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నానని.  అధికార పక్షం ఇంత దుర్మార్గంగా, బాధాకరంగా వ్యవహరించడం చూడలేదని చంద్రబాబు అన్నారు.  కనీసం విచక్షణ అయినా పాటించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే  అసెంబ్లీలో అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం చూశామని చంద్రబాబు అన్నారు. చెప్పేది అబద్దం, చేసేది ఛాలెంజ్..ఇంతకన్నా బరితెగింపు ఇంకేమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. తాను రికార్డులతో  సభలోకి వస్తే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని పరారు కావడం చూశామన్నారు. రికార్డులు తెప్పిస్తే, మీరు రాజీనామా చేస్తారా అని బాబు జగన్ కు సవాల్  విసిరారు.

Latest Updates