ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తు

ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. చంద్రబాబు భేటీకి ఒక రోజు ముందు బీజేపీ నేత, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేశ్ భేటీ జరగటం చర్చనీయాంశం అయ్యింది. అమిత్ షాతో చంద్రబాబు భేటీకి ఆయనే రూట్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. ఇప్పటికే బీజేపీతోనూ పొత్తులో ఉంది. ఈ క్రమంలోనే అమిత్ షాతో చంద్రబాబు భేటీకి ప్రయార్టీ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు హస్తిన బాట పట్టారు. ఈ రోజు రాత్రికి ( ఫిబ్రవరి 7  బుధవారం) రాత్రి కానీ, రేపు  గురువారం( ఫిబ్రవరి 8)  కానీ ఆయన అమిత్‌షాతో సమావేశమవుతారు. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో  చంద్రబాబు అమిత్ షాతో భేటీకానుండటం చర్చనీయాంశమైంది.. 

టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి.

 టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి రాజకీయ మద్దతు మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అప్పట్లో ప్రత్యేక హోదా కాదని.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది అంటూ ప్రజలను సవిరంగా వివరించారు చంద్రబాబు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ యూటర్న్ తీసుకున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి.. ఢిల్లీ వేదికగా మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేసిన చంద్రబాబు కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వను అన్న బీజేపీతో మళ్లీ చంద్రబాబు కలుస్తున్నారు అంటే.. హోదా అంశాన్ని టీడీపీ పక్కన పెట్టేసినట్లే అని స్పష్టం అయ్యింది.2024  ఎన్నికల్లో  సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ మళ్లీ ఎన్డీయే గూటికి చేరుతుందనే ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి.

ఎన్నికల నిర్వహణకు బీజేపీ  సహాయ, సహకారాలు లేకపోతే విజయం సాధించడం సాధ్యం కాదని టీడీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన వాతావరణం నుంచి వెసులుబాటు కోసం కాషాయంతో మళ్లీ కలిసి బరిలో దిగేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయని రాజకీయ విశ్లేషకులు  చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అండ లేకుండా ఎన్నికలకు వెళితే ఫలితం ఉండకపోవచ్చని  టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.