రాజధాని రైతులకు పరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు

అమరావతి, వెలుగు ఏపీ రాజధాని అమరావతికి కులాన్ని అంటగట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలో చేతకాని సీఎంగా జగన్ మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావించింది తన కోసం కాదని రాష్ర్ట ప్రజలందరి కోసమని అన్నారు. రాజధానిని వైసీపీ ప్రభుత్వం చంపేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రాంతాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాజధానిని తరలిస్తే గత ప్రభుత్వంలో సేకరించిన రైతుల భూములకు ఎకరానికి రూ.10 కోట్లు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అమరావతి చైతన్యయాత్రలో భాగంగా  పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. జేఏసీ నేతలతో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు, గణపవరం, పాలకొల్లులో పర్యటించారు. అమరావతి పోరాటానికి జోలెపట్టి నిధులు సేకరించారు. అంతకు ముందు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయనకు నివాళులు అర్పించారు.

32వ రోజూ ఆందోళనలు

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడబోమని రాజధాని ప్రాంత రైతులు చెప్పారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 32 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నలుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. రాజధాని ఆందోళనల్లో భాగంగా శనివారం తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు మహా ధర్నా చేపట్టారు. కృష్ణాయపాలెం, వెంటకపాలెం, నవులూరు, నీరుకొండ, తుళ్లూరులో రిలే దీక్షలు కొనసాగించారు.

గవర్నర్ ను కలిసిన మహిళా రైతులు

రాజధాని తరలింపును అడ్డుకోవాలని మహిళా రైతుల బృందం రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరించదన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమపై పోలీసుల దాడి, రాజధానిలో 144 సెక్షన్ అమలుపై ఫిర్యాదు చేశారు. 144 సెక్షన్ ను వెంటనే తొలగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

అమరావతిపై ప్రజా బ్యాలెట్

రాజధాని అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు.  ఉండవల్లి సెంటర్‌‌లో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ లో వేలాది రైతులు అభిప్రాయాలు తెలిపారు. ప్రజా బ్యాలెట్ లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని ఓటేశారు.

Latest Updates