మీ జాతకం నాకు బాగా తెలుసు : చంద్రబాబు

అమరావతి, వెలుగు: ప్రతి ఒక్కడి జాతకం తనకు తెలుసని.. ఎక్కువ చేస్తే చట్టమే చివరికి ఉరితాడుగా మారుతుందని పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.  పోలీసులు మంచిగా ఉంటే తాను మంచిగా ఉంటానని అలా కాకుండా తమాషాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సీఎం అండతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ సీపీపై అభిమానం ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాలని పోలీసులకు సూచించారు. గురువారం విశాఖపట్నంలో పార్టీ నాయకులతో చంద్రబాబు  సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  టీడీపీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ పోలీసులు ఎక్స్ ట్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరేం చేస్తున్నారో తాను నిత్యం గమనిస్తూనే ఉంటానని సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. పార్టీ కేడర్, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తాను ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం రౌడీ పార్టీ అధికారంలో ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వైఎస్సార్ సీపీ నేతలంతా కలిసి ప్రభుత్వాన్ని నేరస్తులమయం చేశారని  ధ్వజమెత్తారు.

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు తాను గర్వపడుతున్నానన్నారు. అమరావతిని అంతకు మించి అభివృద్ధి చేసేందకు ప్రణాళికలు రచించామని, అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ అమరావతిని చంపేయాలని ప్లాన్ చేసిందని, అందుకోసమే అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ నాటకాలు అడుతోందని మండిపడ్డారు. ఓడిపోయాం అధికారం లేదు అని ఎప్పుడూ భయపడరాదని, ప్రజల పక్షాన పోరాటం చేయడం వల్ల దేన్నైనా సాధించవచ్చని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Latest Updates