నా ఇల్లు ముంచడానికే మీ ఇళ్లన్నీ ముంచారు

వరద సహాయక చర్యల్ని ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని.. వరద నీటి మేనేజ్మెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఆయన పర్యటించారు. వరద బాధితులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలన్నది అందరి డిమాండ్‌ అని.. ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలన్నారు. వరద బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడి నుంచి ప్రజల్ని తరలిస్తామని మంత్రులు అనడం తగదన్నారు. ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలన్న చంద్రబాబు.. తన ఇల్లు ముంచడానికే ప్రజల ఇళ్లను ముంచారన్నారు. జలాశయాలను నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్లపైకి వదిలారని విమర్శించారు. మంత్రులు తన ఇంటి చుట్టూ తిరిగారు తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి బాధితుల్ని ఆదుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మూసివేయడంతో పాటు ఇసుక కొరత సృష్టించారని ఆరోపించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఇళ్ల పట్టాలు సాధించే వరకూ టీడీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.

Latest Updates