ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి: రాజీనామాకు రెడీ.. సిగ్గుంటే వెళ్లిపో!

  • ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి: సవాల్ – ప్రతి సవాల్

ఏపీ అసెంబ్లీలో ఉల్లిగడ్డ ధర భారీగా పెరగడంపై హోరాహోరీగా చర్చ నడిచింది. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ప్రభుత్వం పేదల ప్రాణాలతో ఆడుకుంటోందని , సీఎం జగన్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. దానికి ప్రతిగా కౌంటర్ ఇస్తూ సిగ్గులేకుండా టాపిట్ డైవర్ట్ చేస్తున్నారంటూ బాబును రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉల్లి ధరల పెరుగుదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎవరెమన్నారంటే…

పేద వాడి ప్రాణాలంటే చులకన భావన తగదు: బాబు

చంద్రబాబు: ఉల్లిపాయల ధర భారీగా పెరగడంతో పెదలు ఇబ్బందులు పడుతున్నారు. గుడివాడలో ఓ వృద్ధుడు సబ్సిడీ ఉల్లిపాయల కోసం రైతు బజార్‌లో క్యూలో నిలబడి చనిపోయాడు. కానీ, దీన్ని కూడా వక్రీకరించి సహజ మరణం అన్నట్లుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. పేదలు పడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడుతుంటే మాపై ఎదురు దాడి చేయడమేంటి? అతడు ఉల్లిపాయలకు పోలేదా చెప్పండి. అతడు ఉల్లిపాయలకే పోలేదన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడడం దారుణం. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వినియోగదారుడి జీవితాలతో కూడా మీరు (ప్రభుత్వం) ఆడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పేద వాళ్ల ప్రాణాలంటే చులకన భావం సరికాదని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.

వాళ్లది పేద కుటుంబం కాదు: నాని

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని: నిన్న గుడివాడ రైతు బజారుకు సాంబిరెడ్డి అనే రైతు కూరగాయల కోసం వెళ్లాడు. ఆయన ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తూ గుండె జబ్బు రావడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన కొడుకులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. వాళ్లది పేద కుటుంబం కాదు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లు. మూడంతస్తుల ఇల్లు కూడా ఉంది. ఆయన మార్నింగ్ వాక్ నుంచి వస్తూ రైతు బజార్‌కు కూరగాయల కోసం వెళ్లారు తప్ప ఉల్లిపాయల కోసం కాదు. గుండె పోటుతో మరణించాడు. టీడీపీ రాబందులు, కొన్ని మీడియా రాబందులు అక్కడికెళ్లి.. ఉల్లిపాయలకు పోయి మరణించాడని చెబితే చంద్రబాబు ఇంటికొస్తాడని, రూ.25 లక్షలు పరిహారం ఇప్పిస్తామని చెప్పాయి. కానీ, ఆ కుటుంబం తమకు ఉల్లి కోసం రైతు బజార్‌కు వెళ్లి నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది.శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు

సీఎం జగన్: ఉల్లిపాయల గురించి జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కిలో ఉల్లి రూ.25కే ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. హెరిటేజ్‌లో రూ.200కి ఉల్లిపాయలు అమ్ముతున్నా.. రైతు బజార్లలో రూ.25కే అమ్ముతున్నాం కాబట్టే ఇంతగా క్యూలు ఉన్నాయని అర్థం కావట్లేదా? అయినా గానీ చంద్రబాబు మాట్లాడుతున్న తీరు శవాల మీద రాజకీయం చేసే రకమేనని అర్థమవుతోంది. వీళ్లు (ప్రతిపక్షం) చేస్తున్నది ధర్మమేనా అని వాళ్ల మనస్సాక్షినే అడగాలి.

హెరిటేజ్ మాది కాదు.. అమ్మేశాం

చంద్రబాబు: హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదు. అమ్మేశాం అని నిన్ననే చెప్పా. అయినా ముఖ్యమంత్రి ఇలా సభ్యత లేకుండా మాట్లాడడం తగదు. ఆయనకి సవాల్ విసురుతున్నా. హెరిటేజ్ మాదేనని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. అదే నిరూపించలేకపోతే ఆయన (జగన్)కు సీఎంగా కొనసాగే అర్హత లేదు. సవాల్ స్వీకరించాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా.

సిగ్గులేకుండా డైవర్ట్ చేస్తున్నారు

కొడాలి నాని: ఆయన (చంద్రబాబు) సిగ్గు లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు గుడివాడ రైతు శవం ఫొటోలను ప్రదర్శించారు. ఆయన చనిపోయింది ఉల్లిపాయల కోసం కాదని ఆ కుటుంబం చేత సభలోనే చెప్పిస్తా.. వాళ్లు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతారా అని నేను సవాలు చేస్తున్నా.

Latest Updates