ఇది ఎంత మాత్రమూ ఓటమి కాదు  

chandrayaan-2-achieved-90-95-objectives-says-isro-chief-k-sivan
  • డీడీ ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్​ కె.శివన్     
  • విక్రమ్​ను లైన్​లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
  • 14 రోజులు దానిపైనే మా దృష్టంతా
  • విక్రమ్​ ఫలితం వేరే ప్రయోగాలపై పడదు

బెంగళూరు: విక్రమ్​ ల్యాండింగ్​ ప్రయోగంలో తాము ఓడిపోలేదని, ఇది ఎంత మాత్రమూ ఓటమి కాదని ఇస్రో చైర్మన్​ కే శివన్​ తేల్చి చెప్పారు. ఇప్పుడు తాము కోల్పోయింది ఓ చిన్న విషయం మాత్రమేనన్నారు. దీని ప్రభావం తర్వాత చేయబోయే ప్రయోగాలపై ఏ మాత్రం పడదన్నారు. శనివారం ఆయన డీడీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే..

పిల్లల మనసు నిర్మలం..

నిజం. మేమేం ఓడిపోలేదు. ఓటమి కాదు. ఈ విషయంలో పిల్లలు కరెక్ట్​. ప్రతి విషయంపై వాళ్లకు ఓ ఆసక్తి అనేది ఉంటుంది. వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టే అందరికన్నా బాగా ఏ విషయాన్నైనా వాళ్లు అర్థం చేసుకుంటారు. పిల్లలు ఇలా వచ్చి ప్రయోగాలు చూస్తుంటే మాకూ స్ఫూర్తిగా ఉంటుంది. భవిష్యత్తులో వాళ్లేం చేయాలో ఈ ప్రయోగాలు వాళ్లకు చెబుతాయి. మేం వాళ్లకు లైవ్​గా చూపిస్తున్నాం. విక్రమ్​ ప్రయోగం నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నా.

చంద్రయాన్​2.. 100% సక్సెస్​

30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విక్రమ్​ను బాగానే తీసుకెళ్లాం. అయితే, చివరి దశలో 2.1 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేటప్పటికి అది గతి తప్పింది. విక్రమ్​ నుంచి సిగ్నల్​ కోల్పోయినా మేం ల్యాండింగ్​ ప్రక్రియలో 95 శాతం సక్సెస్​ అయ్యాం. చంద్రయాన్​ 2 మిషన్​ దాదాపు వంద శాతం సక్సెస్​ఫుల్​ అయినట్టే. ల్యాండింగ్​ను నాలుగు ఫేజ్​లలో చేయాల్సి ఉంది. రఫ్​బ్రేకింగ్​ ఫేజ్​, కోర్సింగ్​ ఫేజ్​, ఫైన్​ బ్రేకింగ్​ ఫేజ్​, టెర్మినల్​ ఫేజ్​. మూడు ఫేజ్​లు బాగానే జరిగాయి. చివరి ఫేజ్​లోనే లింక్​ పోయింది. మళ్లీ దాన్ని లైన్​లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. 14 రోజులు దానితో కమ్యూనికేషన్​ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో సక్సెస్​ అయితే, పేలోడ్​లతో జాబిల్లిపై ప్రయోగాలు చేస్తాం.

తర్వాతి మిషన్లపై ప్రభావం లేదు

విక్రమ్​ ల్యాండింగ్​ ఫలితం ప్రభావం ఇతర ప్రయోగాలపై పడదు. మా దృష్టంతా ఇప్పుడు కార్టోశాట్​3 మిషన్​పైనే ఉంది. అక్టోబర్​ చివరి నాటికి ఆ శాటిలైట్​ను కక్ష్యలోకి ప్రవేశపెడతాం. ఆ తర్వాత వారానికే ఆర్​ఏశాట్​2బీఆర్​ మిషన్​ ఉంటుంది. ఆ రెండు ప్రయోగాల తర్వాత గగన్​యాన్​పైనే పనిచేస్తాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్​యాన్​ మిషన్​ను చాలా సీరియస్​గా తీసుకున్నాం. 2020  చివరి నాటికి ఈ ప్రయోగాన్ని చేస్తాం. ఇవే కాకుండా ఇంకా చేతి నిండా చాలా మిషన్లున్నాయి. వాటితో చాలా బిజీగా ఉన్నాం.

ఆర్బిటర్​ సైన్స్​.. ల్యాండర్​ టెక్నాలజీ

చంద్రయాన్​ 2లో రెండు విషయాలున్నాయి. ఒకటి సైన్స్​, రెండు టెక్నాలజీ. సైన్స్​కు ఆర్బిటర్​ చాలా చాలా కీలకం. ల్యాండర్​, రోవర్లు టెక్నాలజీకి నిదర్శనం. ఆర్బిటర్​లో చాలా ప్రత్యేకమైన పేలోడ్లున్నాయి. అందులో ఒకటైన డ్యుయల్​ బ్యాండ్​ ఎస్​ఏఆర్​ ముఖ్యం. ఎల్​, ఎస్​ బ్యాండ్​లుంటాయి. చంద్రయాన్​ 1 సహా ఇప్పటిదాకా జరిగిన ఆర్బిటర్​  ప్రయోగాల్లో ఒక్క ఎస్​బ్యాండ్​ మాత్రమే ఉండేది. చంద్రయాన్​ 2లో ఎల్​బ్యాండ్​ను జత చేశాం. ఈ ఎల్​బ్యాండ్​ చంద్రుడి ఉపరితలంపై 10 మీటర్ల లోతు వరకు స్కాన్​ చేయగలదు. ధ్రువాల వద్ద ఐస్​, వాటర్​ ఆనవాళ్లను ఇది కనిపెడుతుంది. అదే దాని స్పెషాలిటీ. ఆర్బిటర్​లో హై రిజల్యూషన్​ కెమెరాలున్నాయి. 0.32 మీటర్​ రిజల్యూషన్​ ఉంటుంది. ఇమేజింగ్​ ఐఆర్​​ స్పెక్ట్రో మీటర్​ కూడా కీలకమే. ప్రపంచ దేశాలు 3 మైక్రాన్​ వేవ్​లెంగ్త్​ కలిగిన వాటినే వాడుతున్నాయి. కానీ, చంద్రయాన్​ 2 ఆర్బిటర్​లో 5 మైక్రాన్​ వేవ్​లెంగ్త్​ పవర్​ ఉన్న దానిని వాడాం. ఈ పేలోడ్​లన్నీ కలిసి చాలా డేటాను సేకరిస్తాయి.

మోడీ మాటలు మాకు స్ఫూర్తి

మేం ప్రయోగంలో ఫెయిలైనా ప్రధాని నరేంద్ర మోడీ మాకు ధైర్యం చెప్పారు. మాలో స్ఫూర్తి నింపారు. మా అందరికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. సైన్స్​ ఫలితాల కోసం చూడదని, కేవలం ప్రయోగాలకు అది వారధి అని ప్రధాని చెప్పారు. ఆ ప్రయోగాలే ఫలితాలిస్తాయన్నారు. ఆయన చెప్పింది నిజం. ప్రధాని మాటలతో సైంటిస్టుల్లో చాలా ధైర్యం వచ్చింది.

ఆర్బిటర్​ ఏడున్నరేళ్లు..

ఆర్బిటర్​ 100 శాతం బాగా పనిచేస్తోంది. సైన్స్​కు సంబంధించి దానిలో మేం సక్సెస్​ అయ్యాం. ధ్రువాల వద్ద అది పనిచేస్తుంది. నిజానికి ఆర్బిటర్​ ఏడాదిపాటు పనిచేసేటట్టే తయారు చేశాం. కానీ, దానిలో ఇప్పుడు చాలా ఎక్కువ ఇంధనం ఉంది. దాంతో అది ఏడున్నరేళ్లు పనిచేస్తుంది. ఈ ఏడున్నరేళ్లలో ఆర్బిటర్​ చాలా డేటాను సేకరిస్తుంది. అందులోని హై రిజల్యూషన్​ కెమెరాతో మొత్తం చంద్రగోళాన్ని కవర్​ చేయొచ్చు. ఫొటోలు తీయొచ్చు. ఆర్బిటర్​ సేకరించిన డేటాను ప్రపంచ దేశాలు వాడుకోవచ్చు. ప్రయోగాలు చేయొచ్చు.

Chandrayaan 2: Achieved 90-95% objectives, says ISRO chief K Sivan

Latest Updates