లెక్కలు మారినయ్‌‌.. ఖర్చులూ మారినయ్

  • వందేళ్లలో దేశాల మిలిటరీ ఖర్చుల్లో మార్పులు
  • 1910ల్లో జర్మనీ టాప్‌‌
  • 1970ల్లో తెరపైకి రష్యా
  • 1990 నుంచి అమెరికా
  • 90ల్లో తొలిసారి టాప్‌‌ 10లోకి ఇండియా
  • 2018లో నాలుగో స్థానం

ప్రస్తుతం ప్రపంచంలో బలమైన మిలిటరీ ఉన్న దేశం అమెరికా. సైనికదళానికి చేస్తున్న ఖర్చులో 2010 నుంచి టాప్‌‌లో ఉంటోంది. కానీ మిలిటరీ ఖర్చులో ఎప్పుడూ అమెరికాదే ఫస్ట్‌‌ ప్లేస్‌‌ కాదు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు ఖర్చును ప్రభావితం చేస్తూ వచ్చాయి. 1910 నుంచి1950 టైంలో యూరోపియన్‌‌ యూనియన్‌‌ దేశాలు మిలిటరీకి ఎక్కువగా ఖర్చు చేశాయి. 1975లో కోల్డ్‌‌ వార్‌‌ టైంలో సోవియట్‌‌ రష్యా తెరపైకి వచ్చింది. మిలిటరీకి బాగా ఖర్చు చేసింది. సోవియట్‌‌ యూనియన్‌‌ విడిపోవడంతో అమెరికా బలం పెరిగింది. 1990 నుంచి  మిలిటరీపై ఊహించని రీతిలో ఖర్చు చేయడం మొదలుపెట్టింది. 30 ఏళ్లుగా టాప్‌‌లో ఉంటోంది.

1914లో కింగ్‌‌ జర్మనీ

ఈ టైంలోనే మొదటి ప్రపంచయుద్ధం స్టార్టయింది. యుద్ధంలో ముందున్నది యూరోపియన్‌‌ యూనియన్‌‌ దేశాలే కాబట్టి ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. రక్షణ, ఆయుధాల ఖర్చులో జర్మీనీ టాప్‌‌లో నిలిచింది. రూ. లక్షా 64 వేల కోట్లు ఖర్చు చేసింది. తర్వాతి స్థానంలో బ్రిటన్‌‌ ఉంది. రూ. లక్షా 57 వేల కోట్లు వెచ్చించింది. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌‌ (లక్షా 14 వేల కోట్లు), ఆస్ట్రియా హంగేరి (93 వేల కోట్లు), రష్యా (78 వేల కోట్లు), అమెరికా (24 వేల కోట్లు), జపాన్‌‌, స్పెయిన్‌‌, ఇటలీ, చైనా ఉన్నాయి.

1939లోనూ జర్మనీనే

ఇదే సమయంలో రెండో ప్రపంచయుద్ధం స్టార్టయింది. సైనికులు, ఆయుధాలకు ఖర్చు చేయాల్సిందే. ఈ టైంలోనూ ఖర్చులో జర్మనీనే టాప్‌‌లో నిలిచింది. రూ. 8 లక్షల74 వేల కోట్లు రక్షణకు పెట్టింది. తర్వాతి స్థానంలోని బ్రిటన్‌‌ రూ. 5 లక్షల 73 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈసారి మూడో ప్లేస్‌‌కు రష్యా వచ్చింది. రూ. 4 లక్షల37 వేల కోట్లు ఖర్చు చేసింది. తర్వాతి స్థానాల్లో జపాన్‌‌ (రూ. లక్షా 21 వేల కోట్లు), ఫ్రాన్స్‌‌ (రూ. 71 వేల కోట్లు), అమెరికా (రూ. 70 వేల కోట్లు), పోలండ్‌‌, ఇటలీ, జెకోస్లేవేకియా, చైనా ఉన్నాయి.

1975లో పైపైకి రష్యా

అమెరికా, సోవియట్‌‌ యూనియన్‌‌ మధ్య కోల్డ్‌‌ వార్‌‌ జరుగుతున్న సమయమిది. రెండు దేశాలు పోటీపడి మరీ రక్షణపై ఖర్చు పెట్టాయి. కానీ రష్యానే పైచేయి సాధించింది. 23 లక్షల 94 వేల కోట్ల ఖర్చుతో టాప్‌‌లో నిలిచింది. రూ.17 లక్షల కోట్లతో అమెరికా రెండో ప్లేస్‌‌లో ఉంది. తర్వాతి స్థానంలో చైనా (రూ. 5 లక్షల 30 వేల కోట్లు), వెస్ట్‌‌ జర్మనీ (రూ. 2 లక్షల 79 వేల కోట్లు), ఫ్రాన్స్‌‌ (రూ. 2 లక్షల 43 వేల కోట్లు), యూకే (రూ. 2 లక్షల 15 వేల కోట్లు), ఇరాన్‌‌, పోలండ్‌‌, ఇటలీ, జపాన్‌‌ ఉన్నాయి.

2010లోనూ పెద్దన్న అమెరికానే

2010లోనూ మిలిటరీ ఖర్చులో అమెరికానే టాప్‌‌ ప్లేస్‌‌ నిలబెట్టుకుంది. రెండో ప్లేస్‌‌లోకి మాత్రం అనూహ్యంగా డ్రాగన్‌‌ కంట్రీ చైనా వచ్చింది. రష్యా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ టైంలోనే తొలిసారి ఇండియా టాప్‌‌ 10లో స్థానం సంపాదించింది. రూ.34 లక్షల 30 వేల కోట్లతో అమెరికా టాప్‌‌లో, రూ.12 లక్షల 84 వేల కోట్లతో చైనా రెండో ప్లేస్‌‌లో, రూ. 3 లక్షల కోట్లతో ఫ్రాన్స్‌‌ మూడో స్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో రష్యా (రూ.2 లక్షల 86 వేల కోట్లు), యూకే (రూ.2 లక్షల 70 వేల కోట్లు), జపాన్‌‌ (రూ.2 లక్షల 65 వేల కోట్లు), జర్మనీ (రూ.2 లక్షల 22 వేల కోట్లు), ఇండియా (రూ.2 లక్షల 22 వేల కోట్లు), సౌదీ అరేబియా, బ్రెజిల్‌‌ ఉన్నాయి.

1990ల్లో అమెరికా ఆగయా

సోవియట్‌‌ యూనియన్‌‌ విచ్ఛిన్నంతో అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా ఎదిగింది. పెద్దన్న కాబట్టి రక్షణ, మిలిటరీపై పెద్దగానే ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ప్రపంచంలోని మూలమూలకు తన ఫోర్స్‌‌ను పంపించడం స్టార్ట్‌‌ చేసింది. రూ. 25 లక్షల 47 వేల కోట్ల మిలిటరీ ఖర్చుతో అమెరికా టాప్‌‌లో, రూ. 11 లక్షల 34 వేల కోట్లతో రష్యా రెండో ప్లేస్‌‌లో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో యూకే (రూ.3 లక్షల 37 వేల కోట్లు), జర్మనీ (రూ.3 లక్షల 22 వేల కోట్లు), వెస్ట్‌‌ జర్మనీ (రూ.3 లక్షల 8 వేల కోట్లు), ఫ్రాన్స్‌‌ (రూ.3 లక్షల కోట్లు), జపాన్‌‌ (రూ. 2 లక్షల 51 వేల కోట్లు), సౌదీ అరేబియా, ఇటలీ, కువైట్‌‌ ఉన్నాయి.

ఇప్పటికీ యూఎస్సే

మిలిటరీ ఖర్చులో ఇప్పటికీ అమెరికానే ముందుంది. తర్వాతి 8 స్థానాల్లోని దేశాలు చేస్తున్న మొత్తం ఖర్చును యూఎస్‌‌ ఒక్కటే చేస్తోంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇండియా గురించి. లిస్టులో నాలుగో స్థానానికి వచ్చేసింది. పాకిస్థాన్‌‌ మిలిటరీ బడ్జెట్‌‌ కన్నా ఆరింతలు ఎక్కువ ఖర్చు చేస్తోంది. 2018లో అమెరికా రక్షణ కోసం రూ.31 లక్షల 85 వేల కోట్లు వెచ్చించింది. రెండో స్థానంలో ఉన్న చైనా రూ.12 లక్షల 26 వేల కోట్లు ఖర్చు చేసింది. తర్వాతి స్థానాల్లో ఉన్న సౌదీ అరేబియా రూ.3 లక్షల 29 వేల కోట్లు, ఇండియా రూ. 3 లక్షల 22 వేల కోట్లు ఖర్చు చేశాయి. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌‌, రష్యా, యూకే, జర్మనీ, జపాన్‌‌, సౌత్‌‌ కొరియా ఉన్నాయి.

Latest Updates