ట్యాప్ తిప్పితే మురుగు నీరే.. మా ఊరిని పట్టించుకోరూ

హైదరాబాద్: శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ గ్రామంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో ఆ గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ సర్పంచ్‌‌పై వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌‌ ఎదురు తిరిగారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మ్యాన్‌‌హోల్ పైన మూతలు లేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌గా ఎన్నికై రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని చౌదరిగూడ గ్రామస్థులు, వార్డు సభ్యులు వాపోతున్నారు. వివరాలు.. శంషాబాద్ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ గ్రామానికి తాగునీరు లేకపోవడంతో ప్రజలందరూ బోర్ వాటర్ పైనే ఆధారపడుతున్నారు. అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగు నీరు లీకై బోర్లలోకి వెళ్తోంది. దీంతో ఆ నీరును తాగిన జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు ప్రజలకు స్కిన్ ఎలర్జీలు రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్య సమస్యలకు నీళ్లే కారణమని డాక్టర్లు చెప్పారని గ్రామస్తులు చెబుతున్నారు.

విన్నవించినా కనికరం చూపట్లేదు
డ్రైనేజీ సమస్య గురించి గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ కలసి సర్పంచ్ రాజ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని  ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉపసర్పంచ్ కలమ్మ మాట్లాడుతూ.. ప్రధానంగా డ్రైనేజీ సమస్యపై పలుమార్లు మీటింగ్‌‌‌లో సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సుమన్ మాట్లాడుతూ.. చౌదరిగూడ గ్రామంలో 15 సంవత్సరాల కింద డ్రైనేజీని అస్తవ్యస్తంగా  ఏర్పాటు చేశారని.. దీని వల్ల తమ పంట పొలాల్లో మురుగునీరు నిత్యం పారుతోందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిచేయాలని పలుమార్లు సర్పంచ్‌‌తోపాటు అధికారులకు విన్నవించినా వారు ఏమాత్రం కనికరం చూపడం లేదని వాపోయాడు. తన పొలంలో సగభాగం డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతోందని.. దీంతో పొలంలో వేసిన పంట పూర్తిగా చనిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లేకుంటే శంషాబాద్‌‌‌లో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమం నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

Latest Updates