పంజాబ్‌ తొలి దళిత సీఎం ప్రమాణం

పంజాబ్‌ తొలి దళిత సీఎం ప్రమాణం

చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తొలి దళిత సీఎం చన్నీనే. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్జిందర్ రణ్‌ధావా, ఓపీ సోనీ ప్రమాణం చేశారు. కొత్త సీఎం చన్నీకి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిద్ధూ అభినందనలు తెలిపారు.

చన్నీ ఎంపిక వెనక..

పీసీసీ చీఫ్ సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమరిందర్ సింగ్‌ మధ్య సాగిన కోల్డ్ వార్‌‌ చివరికి సీఎం పదవికి కెప్టెన్ రాజీనామా చేసే వరకూ వచ్చింది. శుక్రవారం నాడు కెప్టెన్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసతర్తు మొదలుపెట్టింది. సిద్ధూ సీఎం కావాలని కోరుకున్నప్పటికీ ఆయన పట్ల అమరిందర్‌‌తో పాటు పలువురు సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన పట్ల మొగ్గు చూపలేదు. అయితే పంజాబ్ ఎంపీ అంబికా సోనీ, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సుఖ్జిందర్ సింగ్ రణ్‌ధావా, పార్టీ నేతలు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రా తదితరులు సీఎం రేసులో ఉన్నారని ప్రధానంగా వినిపించింది. అంబికా సోనీకి సీఎంగా హైకమాండ్ అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. అయితే సుఖ్జిందర్‌‌ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేశారని, ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఎవరూ ఊహించని విధంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.  వచ్చే ఏడాది మొదట్లోలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం రాష్ట్ర జనాభాలో 31 శాతం దళితులు ఉన్నారు. వారి ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో దళిత ఓట్లను రాబట్టుకునేందుకు శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్‌‌‌‌పార్టీ ఇప్పటికే చేతులు కలిపాయి. దీంతో ఆ పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు చరణ్‌‌‌‌జిత్‌‌‌‌ను సీఎంగా కాంగ్రెస్ ఎంపిక చేసిందని నేతలు చెబుతున్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు..

58 ఏళ్ల చరణ్‌‌‌‌జిత్ దళిత సిక్కు నేత. చామ్‌‌‌‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కేబినెట్‌‌‌‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఈయనపై ఓ వివాదం కూడా ఉంది. ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను చరణ్‌‌‌‌జిత్ చన్నీ ఎదుర్కొన్నారు. 2018లో మహిళా ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు ఓ టెక్స్ట్ మెసేజ్ పంపడం వివాదంగా మారింది. అప్పట్లో రాష్ట్ర మహిళా కమిషన్ చరణ్​జిత్​ సింగ్​కు నోటీసులు కూడా పంపింది.