పేకాటలో టెక్నాలజీ..తండ్రీ కొడుకుల చీటింగ్​

  • కంటి లెన్స్​, మాగ్నటిక్ ​ప్లేయింగ్​ కార్డ్స్​తో జిమ్మిక్కులు
  • వరంగల్​ సిటీలో ఏండ్ల తరబడి అమాయకులతో దొంగాట
  • లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు

వరంగల్ రూరల్‍, వెలుగు: వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్‍పర్తి మండలం పెగడపల్లికి చెందిన ఓ ముగ్గురికి  పేకాటే జీవితం. ఇందులో ఇద్దరు అయ్యా కొడుకులే. బయటి జనం చూడటానికి సైడుకు ఏవో పనులు చేస్తున్నట్లు కనపడినా మెయిన్‍ ప్రొఫెషన్‍ ఇదే. మొదట్లో ముక్కలకు మార్కింగ్‍ పెట్టి చీటింగ్‍ ఆటాడిన తండ్రికొడుకులు తర్వాత గేమ్‍లో అప్‍గ్రేడ్‍ అయ్యారు. టీంలో మరో వ్యక్తిని చేర్చుకున్నారు. పేకాట సోకుండే ధనవంతులు, విదేశాల నుంచి వచ్చినోళ్లే వీరి టార్గెట్‍. వీరి కారణంగా పెగడపల్లితో పాటు ముచ్చర్ల నాగారం, సిద్దాపూర్‍, బైరాన్‍పల్లి, సీతంపేట, పరకాల, ముల్కనూర్‍, శివనగర్‍, మండిబజార్‍.. ఇలా పదుల విలేజీల్లో వందలాది బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.

పేకాటకు టెక్నాలజీ తోడవుతోంది. దీనిని అందిపుచ్చుకున్న చీటింగ్‍ ప్లేయర్స్​తక్కువ టైంలో ఖరీదైన కార్లు, బిల్డింగులు కొంటున్నారు. చీటింగ్‍ పేకాట కోసం ఇప్పుడు కొత్త తరహా ఐ లెన్స్​అందుబాటులోకి వచ్చాయి. ముంబయి వంటి ఏరియాలతో పాటు ఆన్‍లైన్‍లో దొరుకుతున్నాయి. రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వీటి ధర ఉన్నట్లు ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. ఆటలో కూర్చునేముందు ప్రత్యేక లిక్విడ్‍ డబ్బాలో ఉండే వీటిని  కనుపాప మీద పెట్టుకుంటే చాలు. ఆటలో ముక్కలను టచ్‍ చేయకుండానే ఎదురుగా ఉండే అన్ని కమ్మల నంబర్లు, గుర్తులు తెలిసిపోతాయి. ఇంకేం.. వార్‍ వన్‍ సైడ్‍ అవుతుంది.  అయితే ఇక్కడో ట్విస్ట్​ ఉంది. ఆ లెన్స్​ అన్ని పేకల మీద పనిచేయవు. ఇలాంటి దొంగాట కోసం మార్కెట్లో మాగ్నటిక్‍ కార్డ్స్​అమ్ముతున్నారు. మిగతా ప్లేయింగ్‍ కార్డ్స్​ ఎలా ఉంటాయో అచ్చం ఇవి అలానే ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ మనీ వచ్చే మూడు ముక్కలాటలో చీటర్స్​ ముందస్తు ప్లాన్‍ ప్రకారం ఈ కార్డ్స్ ​రెడీగా పెడుతున్నారు.

పట్టించుకోని ఖాకీలు

పెగడపల్లికి చెందిన పేకాట చీటర్లు కంటికి లెన్స్​పెట్టుకుని హన్మకొండ సిటీలో ఈ తరహా పేకాట ఆడే క్రమంలో కొందరు గుర్తించారు. అప్పటికే వారు రూ.10 లక్షల వరకు ఆటలో మోసపోయారు. హన్మకొండ స్టేషన్లో జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. ఐ లెన్స్​సైతం పోలీసులకు అప్పజెప్పారు.  విచారణ పేరుతో నిందితున్ని స్టేషన్‍ పిలిపించిన ఎస్సై పేకాటలో ఆ  లెన్స్​ఎలా పనిచేస్తుందో స్వయంగా డెమో ద్వారా  చూశారు.  కొత్త తరహా కేసు వస్తే మరింత లోతుగా వెళ్లి అలాంటి ముఠా పనిపట్టాల్సిన ఖాకీలు లైట్‍ తీసుకున్నారు. తమ పరిధిలో కేవలం గొడవ జరిగిందని.. మిగతా అంతా కేయూ స్టేషన్‍ పరిధిలోకి వస్తున్నందున అక్కడికి వెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో బాధితులు అక్కడకూ వెళ్లారు. వారం గడిచినా ఎటువంటి కేసు లేకపోగా.. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారికే వార్నింగులు మొదలయ్యాయి. కాంప్రమైజ్‍ చేసుకో.. లేదంటే పేకాట ఆడినందుకు నీమీద సైతం కేసు తప్పదని చెప్పారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. బాధితులు కక్కలేక మింగలేక లబోదిబోమంటున్నారు.

కేసును కేయూ స్టేషన్​కు బదిలీ చేశాం

ఐ లెన్స్, మాగ్నటిక్‍ ప్లేయింగ్‍ కార్డ్స్​సాయంతో పేకాటలో మోసం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. లక్షల రూపాయలు దోచుకున్నట్లు చెప్పారు. ఒక్క గొడవ తప్పించి.. మొత్తం ఘటనలు కేయూ పరిధిలో ఉన్నాయి. మా స్టేషన్లో పూర్తిస్థాయి స్టాఫ్‍ లేరు. ఆ టైంలో హన్మకొండ స్టేషన్‍ సైతం కేయూ సీఐ చూస్తున్నారు. దీంతో నా వరకు నేను విషయాన్ని ఉన్నతాధికారులకు ఇన్ఫామ్‍ చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించా. ఇప్పుడు వారే చూస్తున్నారు.

– నవీన్‍, ఎస్సై, హన్మకొండ స్టేషన్‍

Latest Updates