కట్టిన చెక్​డ్యామ్​లు కూల్చుతున్నరు

పైసలన్నీ వాగుల పోస్తున్నరు

కట్టిన చెక్​డ్యామ్​లు కూల్చిన్రు.. మళ్లీ నీళ్లు ఆపడానికి సంచులు నింపుతున్నరు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన పనుల్లో ప్లానింగ్​లోపించడంతో నిధులు వృథా అవుతున్నాయి. భక్తుల స్నానాల కోసం జంపన్న వాగులో పారుతున్న నీటిని ఆపడానికి ఒకప్పుడు వాగుకు అడ్డంగా ఇసుక బస్తాలు వేసేవాళ్లు. జాతర జరిగిన ప్రతిసారి ఇలా చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని భావించి శాశ్వతంగా ఉండిపోయేలా చెక్‌‌‌‌డ్యామ్​లు నిర్మించారు. వాటివల్ల ఉపయోగం లేదని కూల్చేసి ఇప్పుడు మళ్లీ ఇసుక బస్తాలనే వాగుకు అడ్డంగా వేస్తున్నారు. ఇందుకోసం రూ.22 లక్షలు ఖర్చుచేస్తున్నారు.

200 మీటర్లకు ఒకటి..

మేడారం మహాజాతర వచ్చే నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా సుమారు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జాతర సమయంలో జంపన్న వాగులోకి లక్నవరం నుంచి నీటిని వదులుతారు. చెక్‌‌‌‌డ్యామ్​ల నిర్మాణం తర్వాత ఇసుక బస్తాల అవసరం ఉండదని భావించారు. తీరా చెక్ డ్యామ్​ల వల్లనే ఎలాంటి ఉపయోగం లేదని భావించిన అధికారులు మళ్లీ ఈసారి కూడా రూ.22 లక్షలతో ఇసుక బస్తాలు నింపి వాగుకు అడ్డంగా వేస్తున్నారు. 8 చోట్ల పనులు జరుగుతున్నాయి. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. 200 మీటర్లకు ఒకటి చొప్పున 1.5 కి.మీ. పొడవున పనులు చేస్తున్నారు.

నిధులు వృథా

ఇసుక బస్తాలతో పనిలేకుండా మోకాలు లోతు నీటిని ఆపడానికి వీలుగా ఐబీ శాఖ అధికారులు గత ఏడాది రూ.12 కోట్లతో మూడుచోట్ల చెక్‌‌‌‌డ్యామ్​లు కట్టారు. పనులు పూర్తయ్యాక చూస్తే ఒక చెక్‌‌‌‌డ్యామ్​ఒడ్డుతో సహా కొట్టుకుపోయింది. చెక్‌‌‌‌డ్యామ్​ల ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల నిల్వ ఉండే నీటిలో భక్తులు దిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. లోతు తెలియక గత ఏడాది కాలంలో 20 మంది భక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఇవన్నీ చూసిన ఉన్నతాధికారులు చెక్‌‌‌‌డ్యామ్ ల వల్ల భక్తులకు ప్రమాదం తప్పితే ఉపయోగం లేదని తేల్చేశారు. వాటిని పగలగొట్టాలని నిర్ధారించారు. రూ. 30 లక్షలు ఖర్చు పెట్టి వాటిని ధ్వంసం చేశారు. దీంతో రూ.12.3 కోట్లు నీళ్ల పాలు చేసినట్లైంది. సోమవారం మేడారంలో మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ నిర్వహించిన సమీక్షలో మేడారం ఆలయ ట్రస్ట్‌‌‌‌ బోర్డు చైర్మన్‌‌‌‌ ఆలం రామ్మూర్తి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నిధులు వృథా చేసిన ఐబీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

Latest Updates