రేషన్​ అక్రమాలకు చెక్: మూడు నెలలకోసారి ఫింగర్ ప్రింట్స్

జిల్లాలోని పౌరసరఫరాల శాఖ రేషన్​కార్డు లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థ ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి రేషన్ లబ్ధిదారుల్లో చనిపోయిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో వారి పేరుపై విడుదలవుతున్న కోటా ఏమవుతోంది? అనే ఆలోచనకు వచ్చి సరికొత్త కార్యక్రమం ఆరంభించినట్లు సమాచారం.  ప్రతి మూడు నెలలకోసారి 15 ఏళ్లు పైబడిన లబ్ధిదారుల వేలిముద్రలను​ సేకరించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈమేరకు  ప్రక్రియను ఆరంభించినట్లు రేషనింగ్​అధికారి ఒకరు చెప్పారు.

జిల్లాలోని పదహారు మండలాల  పరిధిలో ఉన్న  అంబర్‌‌పేట, బేగంగపేట, చార్మినార్‌‌,  ఖైరతాబాద్‌‌,  మలక్‌‌పేట, మెహిదీపట్నం,  నాంపల్లి,  సికింద్రాబాద్‌‌, యాకత్‌‌పూర సర్కిళ్ల వారీగా లబ్ధిదారులకు రేషన్‌‌ సరుకులు పంపిణీ జరుగుతోంది.  ఆయా సర్కిళ్లలో  780  రేషన్‌‌ షాపులు ఉండగా, ఇందులో  ఆహార భద్రత కార్డులు మొత్తంగా 5,72,147 కార్డులున్నాయి.  వ్యక్తికి ఆరు కిలోల బియ్యం,  ఒక్కో కిలో చక్కెర, గోధుమలు పంపిణీ చేస్తుండగా,  ఒక లీటర్​ కిరోసిన్ ​ అందజేస్తున్నారు.  అయితే, 65 ఏళ్ల వయసు పైడిన వ్యక్తులు ఏటా 5 నుంచి పది శాతం చనిపోతున్నారని, అయినప్పటికీ రేషన్​లో వారి కోటా మాత్రం  మంజూరు అవుతోందని అధికారులు అంచనాకు వచ్చారు. వాస్తవానికి ఆహార భద్రత కార్డు కలిగిన వారిలో ఆ కుటుంబంలో  ఎవరైనా చనిపోతే డీలర్​కు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు లబ్ధిదారులు విషయాన్ని డీలర్లకు చెప్పడం లేదు. దీంతో వారికి సంబంధించిన రేషన్ సరుకులు యథావిధిగా సరఫరా అవుతున్నాయి. స్థానికంగా డీలర్లకు ఈ విషయం తెలిసినప్పటికీ కోటాను అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిసింది. కొందరు డీలర్లు ఈ కోటాను బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించేందుకు సదరు పౌరసరఫరాల శాఖ రేషన్​కార్డు లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈమేరకు ఫింగర్​ ఫ్రింట్స్​ సేకరించడ మే ఉత్తమమని భావించి సర్కిళ్ల వారీగా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.

Latest Updates