మిడ్​మానేరు బ్యాక్​ వాటర్​లో… మునిగే చెక్​డ్యామ్​కు రూ.16 కోట్లు

బ్రిడ్జి కమ్​ చెక్​డ్యామే బెటర్

పాత బ్రిడ్జి పక్కనే మరొకటి కట్టాలని ఏడాది క్రితం ప్రతిపాదన

పట్టించుకోని సర్కారు 

రాజన్నసిరిసిల్ల, వెలుగురాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగుపై పాత బ్రిడ్జి పక్కనే కొత్తది కట్టాల్సిన అవసరం ఉందంటూ ఏడాది క్రితం రూ. 24 కోట్ల అంచనాతో ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నేటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి పక్కనే రూ. 16 కోట్లతో 6 ఫీట్ల ఎత్తుతో చెక్​డ్యామ్​ నిర్మించడానికి ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. ఇక్కడ బ్యాక్​వాటర్​ ఫుల్​గా ఉంటే 15 అడుగుల వరకు నీరుంటుంది. అంటే చెక్​డ్యామ్​ మునిగిపోతుంది. అదే  బ్రిడ్జి కమ్​ చెక్​డ్యామ్​ కడితే ప్రజాధనం ఆదా కావడంతోపాటు రెండు విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఆ దిశగా ఆఫీసర్లు, ప్రభుత్వం ఆలోచించడం లేదంటూ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మునిగిపోయే చెక్​డ్యామ్​కు అంత ఖర్చా..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో రూ.155 కోట్లతో 24 చెక్ డ్యామ్​లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సిరిసిల్ల నియోజకవర్గంలో 11,  వేములవాడ నియోజకవర్గంలో 13 చెక్ డ్యామ్​లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఆరు చెక్ డ్యామ్​ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలు, ఆంధ్రా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అవసరం లేనిచోట కూడా అధికార పార్టీ నేత అనుచరుడికి చెక్ డ్యామ్​పనులు అప్పగించి రూ.18.16 కోట్లు నిధులు సాంకేతికంగా మంజూరు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 11 చెక్ డ్యామ్​లకు గాను 10 చెక్ డ్యామ్​లు 9 నుంచి 15 శాతం లెస్​కు దక్కించుకున్నారు. సిరిసిల్ల మానేరు వంతెన పక్కన నిర్మించే చెక్​డ్యామ్​కు మాత్రం అధికారులు ఎస్టిమేట్​కు 4.79 శాతం అదనంగా రూ.18.16 కోట్లకు టెక్నికల్ మంజూరీ చేశారు. కాంట్రాక్టర్ ప్రైస్  రూ.16.35 కోట్లకు అప్పగించారు. సిరిసిల్ల మిడ్ మానేరులో చెక్​డ్యామ్​కడితే గంగమ్మ గుడి వరకు ఏడాదంతా నీళ్లు ఉంటాయని, సిరిసిల్లను వాటర్ హబ్​గా మారుస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ చెక్ డ్యామ్​ఎత్తు కేవలం ఆరు ఫీట్లు కాగా.. ఇక్కడ బ్యాక్ వాటర్ 15 ఫీట్లకు పైగానే ఉంటుందని అంచనా. నీళ్లలో మునిగిపోయే చెక్ డ్యామ్​ నిర్మాణం దేనికి మంచిదో.. ఏం ఉపయోగమో ఇరిగేషన్ శాఖ అధికారులకే తెలియాలని సీనియర్ కాంట్రాక్టర్లు అంటున్నారు.

బ్రిడ్జి, చెక్ ​డ్యామ్ ​కలిపి కడితే..

సిరిసిల్ల జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు బైపాస్ జంక్షన్ నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రం సుమారు ఐదు కి.మీ. ఫోర్ లేన్ రోడ్డు మంజూరు చేశారు. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రం, తంగళ్లపల్లి మండల కేంద్రం ఇప్పటికే కలిసిపోయాయి. మధ్యలో మానేరు వాగుపై 40 ఏళ్ల కింద నిర్మించిన పురాతన బ్రిడ్జి ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్​దృష్ట్యా, ఫోర్ లేన్ నేపథ్యంలో మరో బ్రిడ్జి దీని పక్కనే నిర్మించాల్సిన అవసరం ఉందంటూ ఆర్​అండ్​బీ అధికారులు 2019లో రూ.24 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండానే దీని పక్కనే బ్యాక్ వాటర్లో మునిగిపోయే స్థలంలో రూ.16 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం ప్రారంభించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ చెక్ డ్యామ్​ను రద్దు చేసి మానేరు వంతెన పక్కనే మరో బ్రిడ్జి కమ్​చెక్​డ్యామ్​నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు సైతం పరిష్కారం దొరుకుతుందని, కనీసం రూ. 10 కోట్ల వరకు ఆదా అవుతుందని కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు.

బ్రిడ్జి అవసరం తప్పనిసరి

2019లో మానేరు వంతెన పక్కన మరో వంతెన నిర్మాణం కోసం రూ.24 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా మంజూరీ రాలేదు. సిరిసిల్ల నుంచి తంగళ్లపల్లి ఫోర్ లేన్ రోడ్డు మంజూరైంది కాబట్టి మరో బ్రిడ్జి ఇక్కడ అవసరం ఉంటుంది. బ్రిడ్జి కమ్​ చెక్ డ్యామ్​నిర్మాణం కూడా చేసుకోవచ్చు. కానీ ఎస్టిమేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి.‑కిషన్ రావ్, డీఈఈ, ఆర్అండ్​బీ  సిరిసిల్ల

నీళ్లు తక్కువుంటేనే చెక్​డ్యామ్​తో ఉపయోగం

సిరిసిల్ల మిడ్ మానేరులో ఎప్పుడు మ్యాగ్జిమమ్ వాటర్ లెవల్ ఉంటే ఈ చెక్ డ్యామ్​అవసరం ఉండదు. కానీ మిడ్ మానేరులో వాటర్ తగ్గితే మాత్రం ఈ చెక్ డ్యామ్​ఉపయోగపడుతుంది. ఆర్అండ్​బీ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం లేదు. ఇప్పట్లో ఈ బ్రిడ్జి నిర్మాణం లేదని తెలిసింది. మిడ్ మానేర్ నీళ్లు ఇతర ప్రాంతాలకు వదిలితే వాటర్ లెవల్​తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ చెక్ డ్యామ్​ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. బ్రిడ్జి కమ్​చెక్ డ్యామ్​ నిర్మాణమంటే అది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్లో ఎలాంటి లోపం లేదు. ‑అమరేందర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ, రాజన్నసిరిసిల్ల.

Latest Updates