వీఐపీ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపేశారు

దేశంలోని అన్నీ రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడులోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర పనులకు వెళ్లేవారిని మాత్రమే పోలీసులు, అధికారులు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఎంతో అత్యవసరం అయిన అంబులెన్స్ విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చెన్నైలో ఐలాండ్ గ్రౌండ్స్‌కు సమీపంలో గల ప్రధాన రహదారిపై నుంచి ఓ వీఐపీ కాన్వాయ్ వస్తుందని పోలీసులు అందరినీ ఆపేశారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే వరకు పాదచారులు, వాహనదారులతోపాటు ఎమర్జెన్సీ సర్వీసులందించే అంబులెన్స్‌ను కూడా దాదాపు 15 నిమిషాల పాటు ఆపేశారు. సోమ‌వారం ఉదయం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ‌ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇది చూసిన నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంబులెన్స్ ఆపాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని, అందులో ఉన్న‌ పేషెంట్ ప్రాణాలు పోతే ఆ వీఐపీ తెచ్చివ్వగలడా అని ప్రశ్నిస్తున్నారు.

ఆ కాన్వాయ్ త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి కి చెందిన‌దని కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు రాగా.. పోలీసులు వాటిని ఖండించారు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల కార‌ణంగానే అంబులెన్స్‌ని ఆపామ‌ని, అయినా అందులో పేషెంట్స్ ఎవ‌రూ లేర‌ని అంటున్నారు.

Latest Updates