సమాధిలో 433 కోట్లు : విచారణలో బయటపడింది

అది చెన్నైలోని ఓ పెద్ద శ్మశానం. అక్కడికి పదుల సంఖ్యలో కార్లు వచ్చి ఆగాయి. ఒకరి తర్వాత ఒకరు వేగంగా ఆ కార్లు దిగారు. ఖాకీల రక్షణతో శ్మశానంలోకి వెళ్లారు. సమాధులు తవ్వారు. బయటపడిన వాటిని చూసి షాక్ తిన్నా రు. మనిషి అస్థిపంజరాలు, కుళ్లిన శవాలు ఉండాల్సి న చోట డబ్బు కట్టలు, కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు, ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి మరి. ఆ కార్లలో వచ్చింది ఆదాయ పన్ను అధికారులు. ఇదంతా సినీ ఫక్కీలో 9 రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల ఉదంతం. చెన్నైలోని శరవణ స్టోర్స్ యజమాని యోగరత్నం పొందురై, అతడి వ్యాపార భాగస్వామి , కోయంబత్తూర్ లోని లోటస్ గ్రూప్ , జీఎస్ స్క్ వేర్ కంపెనీల ఓనర్ రామజయం అలియాస్ బాలాకు చెందిన 72 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు.

పన్ను కట్టని, లెక్కల్లో చూపని ₹25 కోట్లు, 12 కిలోల బంగారం, 626 క్యారెట్ల వజ్రాలు, కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలు కనిపించాయి. వాటన్నింటి విలువ రూ.433 కోట్ల అంచనా. యోగరత్నం , బాలాలకు తనిఖీల సమాచారం ముందే వెళ్లింది. సొత్తు దాచడానికి వాళ్లు ఎంతగా ప్రయత్నంచినా ఫలించలేదు. ఓ ఎస్ యూవీలో డబ్బు, ఆస్తి పత్రాలు, బంగారం, వజ్రాలు పెట్టి నగరంలో తిప్పించారు. కొందరు పోలీసు అధికారులే వారికి సమాచారం చేరవేశారు. కంప్యూటర్ల నుంచి అప్పటికే మొత్తం సమాచారాన్ని, డాక్యుమెంట్లు, రికార్డులను డిలీట్ చేశారు. ఆఫీసుల్లోని CCTV ఫుటేజీలనూ తీసేశారు. ఓ కార్లో  కొంత డబ్బు, ఇతర విలువైన వస్తువులు పెట్టి నగరంలో తిప్పించారు. పోలీసుల సాయంతో వాటిని పట్టుకుని తనిఖీ చేస్తే దొరికింది కొద్ది మొత్తమే” అని ఐటీ అధికారులు తెలిపారు.

దర్యాప్తు చేయగా శ్మశాన వాటికలో పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం, డాక్యుమెంట్లు, వజ్రాలు సమాధి చేసినట్టు తేలిందన్నారు. ఆ సమాచారంతో తవ్వగా 433 కోట్ల విలువైన సంపద బయటపడిందని చెప్పారు. 9 రోజుల పాటు సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. దొరికిన దాంట్లో పొందురైకి చెందిన ఆస్తుల విలువ రూ.284 కోట్లు కాగా, బాలా రెండు కంపెనీలకు చెందిన ఆస్తులు రూ.149 కోట్లని తెలిపారు. దీనిపై సంస్థల ఓనర్లు, ఉద్యోగులను విచారిస్తున్నట్టుచెప్పారు.

 

Latest Updates