వేరే వాళ్లయితే ఎప్పుడో పక్కన పెట్టేవారు: వాట్సన్

చెన్నై: ఇటీవల ఫామ్‌ కోల్పోయి తంటాలుపడిన చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్‌ (సీఎస్కే)షేన్‌ వాట్సన్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన గతమ్యాచ్‌లో భారీ అర్ధ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిశాక ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ మాట్లాడుతూ..చాలా మ్యాచ్‌ల్లో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డానని, వేరే ఫ్రాంచైజీ అయితే ఇప్పటికే ఎప్పుడో పక్కన పెట్టేసేదని వ్యాఖ్యానించాడు. తనపై నమ్మకముంచి అవకాశం కల్పించి నందుకు సీఎస్కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి, కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమిం-గ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఇలాంటి భారీ ఇన్నింగ్స్‌ ఆడగలనని గుర్తించి , జట్టులో కొనసాగించడం గొప్పగా ఉందన్నా డు. ఈ లీగ్‌లో గతపది మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క అర్ధసెంచరీ చేయని వాట్సన్‌.. గత మ్యాచ్‌ల్లో 53 బంతుల్లోనే 96 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.

మరోవైపు తన చెత్తఫామ్‌కు గల కారణాలను విశ్లేషించాడు. ఈ టోర్నీలో ఆడటానికి నేరుగా పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి వచ్చానని, బ్యాటింగ్‌లో కాస్త రిథమ్‌ కోల్పోవడంతో ఇబ్బంది పడ్డానన్నాడు. ఆటలో రాణించడానికి కాస్తా అదృష్టం కూడా ఉండాలని, ఈ మ్యాచ్‌లో రైజర్స్‌పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో అదృష్టం కలసి వచ్చిందని పేర్కొన్నా డు. మరోవైపు తనదేశానికే చెందిన క్రికెటర్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు. గత నాలుగైదేళ్లుగా వార్నర్‌ అద్భుతంగా ఆడుతున్నాడని, తనో వరల్డ్‌ క్లాస్‌ ప్లేయరని వ్యాఖ్యానించాడు. తను ఏడాది కాలం పాటు జాతీయ జట్టుకు దూరమవడం దురదృష్టకరమని, అయితే తను తిరిగి టీమ్‌లోకి రానుండడం ఆస్ట్రేలియాకు చాలా సానుకూల పరిణామం అని పేర్కొన్నా డు. మరోవైపు వాట్సన్ ను త్వరగానే ఔట్‌ చేయాలని భావించామని, తను పవర్‌ప్లేవరకు ఉంటూ క్రీజులో నిలదొక్కుకుంటాడని రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్ తెలిపాడు. ఒక్కసారి టచ్‌లోకి వస్తే తనను ఆపడం కష్టతరమవుతుందని వ్యాఖ్యానించాడు.

 

Latest Updates