టీచర్లపాలెంగా మారిన చెర్లపాలెం..!

టీచర్‌‌ మంచోడైతే ఊరు మంచిదవుతుందని చెర్లపాలెం చూసొస్తే తెలుస్తుంది. ‘కొవ్వొత్తిలా తను కాలుతూ లోకానికే వెలుగిచ్చే వాడే టీచర్‌‌’ ఇలాంటి టీచర్లు ప్రతి బడిలో ఉంటారు. కానీ చెర్లపాలెం టీచర్లు కాలిపోయే కొవ్వొత్తులే కాదు తాము పంచిన వెలుగుతోనే కొత్త కొవ్వొత్తులు తయారు చేశారు. వాళ్లు వెలిగించిన కొవ్వొత్తులతో ఎన్నో స్కూళ్లు వెలిగిపోతున్నయ్‌‌. ఆ ఊరి పేరు ‘టీచర్ల’పాలెంగా మోగిపోతోంది!

తొర్రూరు (ఇప్పుడు మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ఉంది)కు దగ్గర్లో చెర్లపాలెం ఉంది. అరవై ఏళ్ల క్రితం మాట.. ఈ ఊరి బిడ్డ పరిపాటి ధర్మారెడ్డికి చదువంటే చాలా ఇష్టం. ఆయన కష్టం ఫలించింది. 1961లో టీచర్‌‌‌‌ జాబ్‌‌‌‌ వచ్చింది. ఈ ఊళ్లో మొదటి టీచర్‌‌‌‌ ధర్మారెడ్డి. మరిపెడ సమితి ఉపాధ్యక్షుడు ప్రతాప్‌‌‌‌ రెడ్డిది కూడా ఇదే ఊరు. వీళ్లిద్దరూ చదవాలని ఇంట్రెస్ట్‌‌‌‌ ఉన్నవాళ్లను పై చదువులకు ప్రోత్సాహించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు టీచర్‌‌‌‌ ఉద్యోగాలకు ఓ దారి చూపించారు. ధర్మారెడ్డి అనుభవం, ప్రతాపరెడ్డి పలుకుబడి ఆ ఊరి యువతకు వరమయ్యింది. చాలా మందికి ఆ రోజుల్లో టీచర్‌‌‌‌ జాబ్‌‌‌‌ వచ్చింది.

ఆ కొలువు చేసే వాళ్ల బతుకులు బాగుపడ్డాయి. వాళ్లను చూసి మా బిడ్డల్ని కూడా బాగా చదివిస్తే మంచిగా బతుకుతారనే ఆలోచనతో ఊళ్లో వాళ్లంతా అప్పోసప్పో చేసి పిల్లల్ని చదివించాలనుకున్నారు. పిల్లల్ని పనిలో పెట్టడం తగ్గిపోయింది. అట్లా చెర్లపాలెం చదువులపాలెం అయింది. అయితే ఏం లాభం? ఊళ్లో చిన్న బడే ఉంది. అయిదో తరగతి పూర్తయితే ఊరు దాటి పోవాల్సిందే. మాటేడు, తొర్రూరు పోవాల్సి వచ్చేది. అంత దూరం పోలేని వాళ్లు మళ్లీ బడిమానుకునేది. అందరూ చదవాలంటే ఊరికి పెద్ద బడిని సాధించాలనుకున్నారు. పట్టుబట్టి 1967లో అనుకున్నది సాధించారు.

 మల్లికార్జున్‌‌‌‌.. ‘మా స్టార్‌‌‌‌’

ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడే ఉండాలి. దగ్గర్లో ఉంటే పనికి సరైన సమయానికి పోవచ్చని గవర్నమెంట్‌‌‌‌ రూల్‌‌‌‌. ఆ రూల్స్‌‌‌‌ని పాటించే మనిషి మల్లికార్జున్‌‌‌‌ టీచర్‌‌‌‌. ఆయనని గవర్నమెంట్‌‌‌‌ చెర్లపాలెం ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసింది. మాటేడు ఆయన సొంతూరు. ఈ రెండు ఊర్లు దగ్గరే అయినా డ్యూటీకి ఏరోజూ ఆలస్యం కాకూడదని ఆయన చెర్లపాలెంలోనే ఉండదల్చుకున్నాడు. ‘తనకున్న నాలెడ్జ్‌‌‌‌ని నలుగురికి పంచేవాడే అసలైన టీచర్‌‌‌‌’. అంతే కానీ, క్లాస్‌‌‌‌కు వచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పడమే టీచర్‌‌‌‌ డ్యూటీ కాదని మల్లికార్జున్‌‌‌‌ మాస్టార్‌‌‌‌ అనుకునేవాడు. ఆయన ఏది మంచిపని అనుకుంటాడో అదే చేస్తాడు. చదువు, సమాజం పట్ల విద్యార్థులకు, ఊరి జనానికి అవగాహన కల్పించేవాడు.

తెలియని విషయాలను చెప్పే మల్లికార్జున్‌‌‌‌ మాస్టార్‌‌‌‌ని ఊళ్లో అందరూ అభిమానించేవాళ్లు. నాటకాల వంటి వాటితో చదువురాని వాళ్లకు బయటి ప్రపంచాన్ని చూపించేవాడు. మల్లికార్జున్‌‌‌‌ మాస్టార్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ అందరూ ఆయన్ని అభిమానించేవాళ్లు. ‘మా స్టార్‌‌‌‌’లాగే మేమూ టీచర్‌‌‌‌ కావాలనుకున్నారు. మల్లికార్జున్‌‌‌‌ మాస్టార్‌‌‌‌లా ఉండాలనుకున్న విద్యార్థులు ఆయనలా టీచరే కావాలని ఎంచుకున్నారు. పై చదువుల చదివిన తన స్టూడెంట్స్‌‌‌‌ టీటీసీ, బీఈడీ కోర్సులు చేశారు. టీచర్‌‌‌‌ ఉద్యోగం సాధించారు. తన స్టూడెంట్స్‌‌‌‌లో ఎక్కువ మంది టీచర్లే అయ్యారు. ఆ తరమే కాదు ఈ తరమూ ఆ దారిలోనే నడిచింది. చదువులపాలెంగా చెప్పుకున్న చెర్లపాలెం టీచర్లపాలెంగా మారిపోయింది. చెర్లపాలెంలో ఇప్పటి వరకు 180 మంది గవర్నమెంట్‌‌‌‌ టీచర్‌‌‌‌ జాబ్‌‌‌‌ సాధించారు. వాళ్లలో 80 మంది రిటైర్‌‌‌‌ అయ్యారు. మిగతా వాళ్లంతా వివిధ జిల్లాల్లో సర్వీసులో ఉన్నారు.

 చీకటి శ్రీనివాస్‌‌‌‌

కథలే జీవిత పాఠాలు

పాఠాలు చెబితేనే బడికి వచ్చిన వాళ్ల బతుకు మారుతుంది. మరి బడికి రాని వాళ్ల బతుకు మార్చడం కూడా బడిపంతుళ్ల డ్యూటీయే. పిల్లలందరూ బడికి రావాలని, డ్రాపవుట్స్‌‌ లేకుండా చేయాలని స్కూల్‌‌ టీచర్స్‌‌ అందరం కలిసికట్టుగా పనిచేశాం. చదువు మీద ఆసక్తి పెరిగితే అందరూ బడికి వస్తారు. బాగా చదువుతారు. అందుకోసం పగలు పాఠాలు చెప్పి రాత్రి జనానికి కథలు చెప్పేవాళ్లం. బుర్రకథ, గొల్లసుద్దులు, వీధి నాటకాలు వేశాం. చదువుకుంటే జీవితం ఎంత బాగా ఉంటుందో మా కళారూపాల ద్వారా జనానికి చెప్పేవాళ్లం. అవి ఆ ఊరిలో మార్పు తెచ్చాయి. ఆ ఊరు ఇంత మంచిగా మారినందుకు సంతోషంగా ఉంది. ఆ ఊరిని మార్చినోళ్లలో నేనొకడిని అయినందుకు గర్వంగాఉంది.

 – అనుమాండ్ల కృష్ణారెడ్డి, రిటైర్డ్ హెడ్‌‌ మాస్టర్‌‌, చెర్లపాలెం గవర్నమెంట్​ స్కూల్​

బతుకుదిద్దే బడి

ఈ బడిలోనే చదివిన. ఇప్పుడీ బడిలోనే టీచర్‌‌గా పనిచేస్తున్న. మా టీచర్లు రుక్మారెడ్డి, సుదర్శన్‌‌‌‌రెడ్డి, మల్లారెడ్డి మా ఊరిలో అందరూ చదువుకోవాలని చాలా కష్టపడ్డారు. వాళ్ల ప్రభావం వల్ల టీచర్‌‌ కావాలనుకున్న. ఇది సామాజిక బాధ్యతతో కూడిన వృత్తి అని మా టీచర్లు చెప్పారు. వాళ్లు చెప్పిందే పాటిస్తున్న.

  – కాల్సాని వెంకట్ రెడ్డి, టీచర్‌‌

విద్యార్థులతో వీడిపోని బంధం

ఉద్యోగం అయిపోయింది. ఇక విశ్రాంతి తీసుకోవడమే మా పని అనుకోకుండా, రిటైర్‌‌ అయినా ఇంకా ఈ స్కూల్‌‌ పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నారు. ఈ స్కూల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కు రిటైర్డ్‌‌ టీచర్స్‌‌ ఇప్పటికీ సహకరిస్తున్నారు. కొంతమంది కొన్ని క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మెరిట్‌‌ స్టూడెంట్స్‌‌కి వాళ్లు బహుమతులు ఇస్తున్నారు. ఆదర్శ ఉపాధ్యాయులు అంటే వీళ్లే.

– తండా ప్రభాకర్‌‌‌‌, హెడ్‌‌మాస్టర్‌‌,
        చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాల

Latest Updates