రేడియేషన్‌‌ను జయించిన అడవి

  • 33 ఏళ్ల తర్వాత మళ్లా పచ్చబడుతున్న చెర్నోబిల్‌ ఏరియా
  • పెను విధ్వంసాన్ని తట్టుకొని నిలబడ్డ చెట్లు
  • మొక్కల్లో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే సెల్స్‌ : సైంటిస్టులు

అది.. 1986 ఏప్రిల్ 26.. ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం సంభవించిన రోజు.. 30 మంది చనిపోయారు.. కొన్ని వేల కిలోమీటర్లు రేడియేషన్‌‌‌‌ గాలులు కమ్మేశాయి.. వేలాది మంది కేన్సర్ల బారిన పడ్డారు. రెండున్నర లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.. ఉక్రెయిన్‌‌‌‌లోని చెర్నోబిల్‌‌‌‌ అణు విద్యుద్‌‌‌‌ కేంద్రంలో జరిగిన విషాదమిదీ! ఈ ఘోర ప్రమాదం జరిగిన విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలోకి ఎంట్రీని నిషేధిస్తూ ‘ఎక్స్‌‌‌‌క్లూజన్ జోన్’‌‌‌‌గా ప్రకటించారు.

ఈ జోన్‌‌‌‌లో ఎవరూ ఉండొద్దు.. ఏమీ పండించొద్దు.. అసలేపనీ చేయొద్దు. కానీ ఇన్నాళ్లూ శ్మశానాన్ని తలపించిన ఈ ప్రాంతం చుట్టుపక్కల ఇప్పుడు జీవకళ కన్పిస్తోంది. చెట్టూచేమ పెరిగి పచ్చగా మారింది. చిన్నపాటి అడవిలా తయారైంది. తోడేళ్లు, ఎలుగుబంట్లు, అడవి పందులు ఇతర జంతువులు వచ్చి చేరాయి. అంత విధ్వంసం జరిగినా చెట్లు మాత్రం ఏపుగా పెరగడానికి కారణమేంటన్న దానిపై సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు.

మనకు, చెట్లకు ఇదీ తేడా..

మనుషులు, పశుపక్ష్యాదులతో పోలిస్తే చెట్లకు రేడియేషన్‌‌‌‌ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందుకు చెట్లలోని సెల్స్‌‌‌‌ (కణాలు) నిర్మాణమే అందుకు కారణమని చెబుతున్నారు సైంటిస్టులు. రేడియేషన్‌‌‌‌కు గురి కాగానే మామూలుగా సెల్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌ దెబ్బతింటుంది. రేడియేషన్‌‌‌‌ కాస్త తక్కువగా ఉంటే కణాలు దెబ్బతిని కేన్సర్‌‌‌‌ వంటి జబ్బులు వస్తాయి. కానీ రేడియేషన్‌‌‌‌ తీవ్రత ఎక్కువుంటే డీఎన్‌‌‌‌ఏ కూడా దెబ్బతిని సెల్స్‌‌‌‌ చనిపోతాయి. ఏ అవయంలోని సెల్స్‌‌‌‌ దెబ్బతిన్నా అది శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు గుండె, మెదడు సెల్స్‌‌‌‌ దెబ్బతింటే దాని ఎఫెక్ట్‌‌‌‌ బాడీ మొత్తం ఉంటుంది. మనుషులు, జంతువుల్లో ఇదే మరణానికి దారి తీస్తుంది. కానీ చెట్లలో ఇలా జరగదని సైంటిస్టులు చెబుతున్నారు.

ప్రమాదాలు లేదా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు జంతువులు, మనుషుల్లా వేరేచోటుకి పారిపోయే అవకాశం లేకపోవడంతో చెట్లలో సెల్స్ వాటికవే రక్షించుకునేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటాయట! ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మొక్కల్లోని కణాలు తమను తాము రెడీ చేసుకుంటాయని సైంటిస్టులు అంటున్నారు. ఆకు, వేరు, కాండం.. ఇలా చెట్టులోని ఏ భాగంలో అయినా సెల్‌‌‌‌ చనిపోతే వెంటనే అలాంటి కణాన్నే తయారు చేసుకునే శక్తి చెట్లకు ఉంటుంది. మొక్కలోని ఏ భాగమైనా అచ్చు అలాంటి సెల్‌‌‌‌నే తయారు చేయగలదు. ఇలాంటి మెకానిజం జంతువులు, మనుషుల్లో ఉండదని సైంటిస్టులు తెలిపారు. మొత్తంగా ఇతర జీవులతో పోలిస్తే చనిపోయిన సెల్స్‌‌‌‌ లేదా టిష్యూ(కణజాలాన్ని) వెంటనే భర్తీ చేసుకునే శక్తి చెట్లకు ఎక్కువగా ఉంటుంది. అలాగే చెట్లలో రేడియేషన్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌తో లేదా డీఎన్‌‌‌‌ఏ మారి కణతులు, గడ్డలు వంటివి ఏర్పడితే జంతువుల్లో మాదిరి దాని కణాలు ఇతర భాగాలకు విస్తరించవు. అక్కడే ఉండిపోతాయి. ఈ కారణాల వల్లే చెర్నోబిల్‌‌‌‌లో తీవ్ర రేడియేషన్‌‌‌‌ వచ్చినా చెట్లు తట్టుకొని నిలబడ్డాయి. అక్కడ కొన్ని చెట్లలోని కణాలైతే ఎంతటి దుర్భర పరిస్థితులు తట్టుకునేలా బలంగా తయారయ్యాయని సైంటిస్టులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌కు సమీపంలోనే 46 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేది. రేడియేషన్‌‌‌‌ ధాటికి చెట్లన్నీ మాడిపోయి ఎర్రగా మారిపోయాయి. అందుకే దానికి రెడ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ అని పేరొచ్చింది. కానీ 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ అడవి అంతా పచ్చబడింది. ఎత్తైన పైన్‌‌‌‌ చెట్లు, గడ్డి, ఇతర మొక్కలు ఎదిగాయి.

Latest Updates