వరుస విజయాలతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో హంపి

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా స్టార్‌‌ ప్లేయర్‌‌, గ్రాండ్‌‌మాస్టర్‌‌ కోనేరు హంపి స్కొల్కొవో ఫిడే మహిళల గ్రాండ్‌‌ ప్రి చెస్‌‌ టోర్నమెంట్‌‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రష్యాలోని స్కొల్కొవోలో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఏడు, ఎనిమిదో రౌండ్లలో విజయం సాధించిన హంపి సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచి టైటిల్‌‌పై ఆశలు రేపుతోంది. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్‌‌లో హంపి 45 ఎత్తుల్లో అలిసబెత్‌‌ పయెజ్‌‌ (జర్మనీ)ని ఓడించింది.

ఇదే రౌండ్‌‌లో ద్రోణవల్లి హారిక 39 ఎత్తుల తర్వాత బల్గేరియా ఆంటోనెటా స్టెఫనోవాతో పాయింట్‌‌ పంచుకుంది. అంతకుముందు ఏడో రౌండ్‌‌లో హంపి 40 ఎత్తుల్లోనే మాజీ నంబర్‌‌ వన్‌‌ బల్గేరియా గ్రాండ్‌‌మాస్టర్‌‌ స్లెఫనోవాపై విజయం సాధించి ఫిడే ర్యాంకింగ్స్‌‌లో నాలుగు నుంచి మూడో ప్లేస్‌‌కు చేరుకుంది. మరో మూడు రౌండ్లు మిగిలున్న టోర్నీలో చైనా జీఎమ్‌‌ వెంజున్‌‌ (6.5) టాప్‌‌ ప్లేస్‌‌లో ఉండగా.. అర పాయింట్‌‌ తేడాతో హంపి (6) సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. 4 పాయింట్లతో హారిక ఐదో స్థానంలో ఉంది.