నాలుగేళ్ల కస్టడీ తర్వాత విడుదలైన మూడు తాబేళ్లు

కస్టడీ, రిమాండ్ మామూలుగా నేరస్తులకు విధిస్తుంటారు. కానీ.. అక్కడ విచిత్రంగా తాబేళ్లను కస్టడీలో ఉంచారు పోలీసులు. రోజులు, కాదు నెలలు కాదు.. ఏకంగా ఏళ్లపాటు తమ కస్టడీలో ఉంచారు. వాటి అదృష్టం బాగుండి.. నాలుగేళ్ల తర్వాత..  వాటికి సహజంగా అనుకూలమైన చెరువులోకి వెళ్లే అవకాశం దక్కింది.

ఈ విచిత్రమైన సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. రాజ్ నంద్ గావ్ జిల్లాలో చేతబడి చేశాడన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నాలుగేళ్ల కిందట జరిగింది. మూడు తాబేళ్లను ఇందుకోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో.. ఆ ఉభయచరాలను కూడా రక్షణ కోసం స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో ఈ కేసు ఇన్నేళ్లు నానుతూ వచ్చింది. నిందితులను జైలుకు పంపిన పోలీసులు.. ఇన్నిరోజులు ఆ మూడు తాబేళ్లను తమ కస్టడీలోనే రక్షణ కల్పిస్తూ వచ్చారు. తాజాగా రాజ్ నంద్ గావ్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో వాటికి ఉపశమనం లభించింది. పోలీసు కస్టడీ నుంచి తాబేళ్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలతో.. తాబేళ్లకు తమ కస్టడీనుంచి విడుదల చేశారు పోలీసులు. వన్యప్రాణి అధికారులతో సహాయంతో.. పోలీసులు ఆ తాబేళ్లను సురక్షితంగా తీసుకెళ్లి.. శివ్ నాథ్ నదిలో వదిలిపెట్టారు. ఆ తాబేళ్లను నీళ్లలో విడుదల చేస్తున్న టైమ్ లో పెద్దసంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని వాటిని ఫొటోలు తీశారు.

Latest Updates