ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌‌ హోమ్‌ డెలివరీ

  • పోర్టల్‌ స్టార్ట్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాయ్‌పూర్‌‌: వైన్‌ షాపుల దగ్గర జనాన్ని తగ్గించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లిక్కర్‌ డోర్‌‌ డెలివరీ స్టార్ట్‌ చేసింది. దీని కోసం మంగళవారం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. మందు కావాల్సిన వారు ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎమ్‌సీఎల్‌) పోర్టల్‌లో లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ఆర్డర్‌‌ చేసుకోవాలి. ఈ హోమ్‌ డెలివరీ కేవలం గ్రీన్‌ జోన్లలో మాత్రమే అని అధికారులు చెప్పారు. ఒక్కొకరు 5000 మిల్లీ లీటర్ల వరకు ఆర్డర్‌‌ చేసుకోవచ్చు. రూ.120 డెలివరీ చార్జీలు విధిస్తారు. లిక్కర్‌‌ కొనాలనుకునే వాళ్లు మొబైల్‌ నంబర్‌‌, ఆధార్‌‌ నంబర్‌‌, ఆడ్రస్‌ ఎంటర్‌‌ చేసి ఆర్డర్‌‌ చేయాలని అధికారులు చెప్పారు. “ వైన్స్‌ దగ్గర గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. సోషల్‌ డిస్టెంసింగ్‌కు ఇబ్బంది కలగకుండా జనాలు ఎక్కువగా బయటికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది” అని ప్రభుత్వ అధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టింది. పూర్తిగా మద్య నిషేధం విధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏకంగా డోర్‌‌ డెలివరీ మొదలు పెట్టింది అని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ధరమ్‌లాల్‌ కౌశిక్‌ చెప్పారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం వైన్స్‌ తెరిచేందుకు వీలు లేదని చెప్పింది. ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగించి కొన్ని సడలింపులు ఇచ్చింది. గ్రీన్‌ జోన్‌లో వైన్స్‌ ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం అనేక ప్రాంతాల్లో వైన్స్‌ ఓపెన్‌ చేయడంతో మద్యం ప్రియులంతా షాపులకు క్యూ కట్టారు. కరోనా వస్తుందనే భయం లేకుండా షాపులు దగ్గర సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించలేదు.

Latest Updates