కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. రోజురోజుకు అన్ని దేశాలలో కరోనా వైరస్ భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్‌లో కూడా దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ అంటువ్యాధి కాదని చెబుతూ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది.

కరోనా వైరస్ చికెన్, మటన్‌లు తినడం వల్ల వ్యాప్తి చెందుతుందని ప్రజలు వాటిని తినడం మానేస్తున్నారు. అసలు వాటిని తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేకున్నా.. వస్తుందేమోనన్న భయంతో ప్రజలు వాటిని తినడంలేదు. దాంతో చికెన్, మటన్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. అయితే చికెన్, మటన్ బదులు ఏంతినాలి అని ప్రజలు వాటికి ప్రత్యామ్యాయాన్ని వెతుకుతున్నారు. అందులో భాగంగా చాలామంది చికెన్, మటన్‌లకు బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా పనస పండుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా పనస పండుకు కిలో రూ. 50 ఉండేది, కానీ ఇప్పడు ఒక్కసారిగా అమాంతం కిలో రూ. 120కి చేరింది. అదే చికెన్ ధర కిలో రూ. 50 లోపే ఉంది.

కరోనా దెబ్బకు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్న ప్రజలు.. పనస పండుతో చికెన్, మటన్ బిర్యానీలు తయారుచేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండటంతో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్ తినడం మంచిదని పూర్ణిమ శ్రీవాత్సవ అనే మహిళ అంటున్నారు. చికెన్, మటన్ బిర్యానీల బదులు కాథల్ (పనస) బిర్యానీ చేసుకోవడం మంచిదని ఆమె అంటున్నారు.

పనస పండు తినడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. చర్మాన్ని ముడతలు పడుకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును పెంచడంతోపాటు.. మంచి జుట్టును కూడా ఇస్తుంది. అంతేకాకుండా.. జీర్ణశక్తిని పెంచడానికి కూడా పనస బాగా పనిచేస్తుంది.

కరోనా వైరస్ చికెన్, మటన్ లేదా చేపల వినియోగం వల్ల వ్యాప్తి చెందదని వైద్యులు, పోషకాహార నిపుణులు పదేపదే చెప్తున్నా కూడా ప్రజలు తమ అనుమానాన్ని వదలడం లేదు. త్వరలోనే ప్రజలలో ఈ విషయంపై అవగాహన వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడతున్నారు.

Latest Updates