పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాదికల్లా పూర్తి చేయాలి

హైదరాబాద్: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు సీఎం. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సిఎం వెల్లడించారు.

-పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

– ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు.

– బిహెచ్ఇఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను సిఎం కోరారు. విద్యుత్ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.

– ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలన్నారు.

– మిషన్ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్ ను మెయింటేన్ చేయాలన్నారు.

Latest Updates