మేడారం జాతరను విజయవంతం చేయాలి: సీఎం

chief-minister-kcr-review-meeting-with-officials-on-medaram-jatara

మేడారం జాతరపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరను విజయవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ఏమరపాటు ఉండొద్దన్నారు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సరైన వ్యూహం అనుసరించాలన్నారు.

వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి మాలోత్ కవిత తదితరులు ముఖ్యమంత్రిని కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. అనంతరం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సిఎం సమీక్షించారు.

‘‘మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలి. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను అక్కడికి పంపాలి. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

chief-minister-kcr-review-meeting-with-officials-on-medaram-jatara