వ్యవసాయ శాఖ పొలం – హలం శాఖగా మారాలి

తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం – కలం శాఖగా కాకుండా పొలం – హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. యాసంగి పంటల సాగు, మార్కెటింగ్ పై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మీక్ష జ‌రిపారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులు తమ పంటలు అమ్ముకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలన్నారు. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలన్నారు. పంటల ధరల విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు సీఎం. దీనికోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త చట్టాల అమలుతో మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తుందన్నారు .

వరిలో ఆధునిక సాగు విధానాలు పాటించేలా చూడాలన్నారు. దీనివల్ల ఎకరానికి పది వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశముందన్నారు. అన్ని రకాల పంటల్లో కొత్త విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు సీఎం. ఆధునిక సాగు పద్ధతులపై అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయెలో పర్యటించాలని చెప్పారు సీఎం. పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేలా.. గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest Updates