హాస్పిటల్లో శిశువు అపహరణ

వెలుగు : ఎన్నో దేవుళ్లకు మొక్కితే పన్నెండేళ్ల తర్వాత బిడ్డ పుట్టింది. చిన్నారికి వైద్యం చేయించడానికి దవాఖానాకు తీసుకొస్తే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అపహరణకు గురైంది.  ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం కల్పగూర్‍ గ్రామానికి చెందిన అనుమాజీ మల్లేశం, మాధవి భార్యభర్తలు. ఏప్రిల్‍ 30న మాధవి మాతా శిశు కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాక  శిశువుకు పచ్చకామెర్లు రావడంతో ఈ నెల 3న తిరిగి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చారు. మంగళవారం ఉదయం డిశ్చార్జ్ కావడంతో ఎస్‍ఎన్‍సీలో  విధులు నిర్వహిస్తున్న ఆయా వనిత  పాపను అప్పగించేందుకు తల్లిదండ్రుల పేర్లు పిలిచింది. అంతలో అక్కడే ఉన్న ఓ మహిళ  ముసుగు ధరించి తానే మాధవి అంటూ పాపను తీసుకొని అక్కడి నుంచి జారుకుంది.  పాప కోసం అసలైన  తల్లిదండ్రులు ఆయాను సంప్రదించగా ఇంతకుముందే ఓ మహిళ తానే తల్లినంటూ శిశువును తీసుకుందని బదులిచ్చింది. ఒక్కసారిగా ఆ తల్లి కుప్పకూలడంతో బంధువులు వనితను నిలదీస్తూ  ఆందోళనకు దిగారు. హాస్పిటల్​అద్దాలను ధ్వంసం చేసి ధర్నా చేశారు.  ఆయాపైనే కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పాపను అపహరించిన నిందితురాలిని గుర్తించారు. ఆ మహిళ వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Latest Updates