గాల్లో తేలుతూ బుడ్డోడి సాహసం

గాల్లో పక్షిలా ఎగరడం అంటే కొందరికి భలే సరదా. ఆ అవకాశం పారాచ్యూట్ జంప్, హెలికాప్టర్ స్కై డైవ్​తో పొందొచ్చు. ఈ సాహస క్రీడలను ఆడేందుకు కొండ ప్రాంతాలకు వెళ్తుంటారు చాలామంది ఔత్సాహికులు. ఈ డైవ్ లు చేయాలంటే ఇష్టంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి అమాంతం నేలపైకి దూకడం, గాల్లో తేలియాడడం సాధారణ విషయం కాదు. పెద్దవాళ్లే చేసేందుకు వెనుకాడే పారా సెయిలింగ్ ని రెండున్నరేండ్ల బుడ్డోడు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు

హైదరాబాద్, వెలుగునగరానికి చెందిన సి. వినోద్ కుమార్, డాక్టర్​లీల దంపతులు ఫిల్మ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వినోద్ కుమార్ బిజినెస్ రంగంలో ఉంటే, లీల ఉస్మానియా హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ఖాజగూడలోని క్రికెట్ రాక్స్ గ్రౌండ్ లో పారాసైలింగ్ జరుగుతుందంటే వినోద్ తన చిన్న కొడుకు క్రిశాంత్ తేజ్ ని తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లాక అందరూ పారాసెయిలింగ్ చేస్తుంటే తాను చేస్తానని మారం చేశాడు. మూడేండ్ల లోపు పిల్లలను పారా సెయిలింగ్ లోకి అనుమతి లేకపోయినా క్రిశాంత్ తేజ్ ఆసక్తిని గమనించి నిర్వాహకులు ఒప్పుకున్నారు. అలా 50అడుగలపైకి వెళ్లి పారాసెయిలింగ్ చేసి అందరినీ అబ్బురపరిచాడు రెండున్నరేండ్ల చిన్నోడు.

రాష్ట్రంలోనే అతి చిన్న పారాసైలర్

స్క్వాడాన్ లీడర్, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శైలేంద్ర ప్రతాప్ సింగ్ ఏటా హైదరాబాద్ లోని కొన్ని స్కూల్స్​లో పారా సైలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది దీన్ని ఖాజాగూడలోని క్రికెట్ రాక్స్ గ్రౌండ్స్​లో నిర్వహిస్తున్నారు. పారా సెయిలింగ్ రెండు రకాలుగా ఉంటాయి. బోట్ ద్వారా చేసేది, జీప్ పారా సెయిలింగ్. జీప్ కి తాడుని కట్టి డ్రైవ్ చేస్తారు. జీప్ ని వెళ్లినంత దూరం వరకు పారా పైకి వెళ్తుంది. ఆ తర్వాత పారాషూట్ ద్వారా కిందికి వస్తారు. శైలేంద్ర ప్రతాప్ సింగ్ జీప్ తో నిర్వహిస్తూ చిన్నారులకు సాహసక్రీడలను పరిచయం చేస్తున్నారు ఎంతో మంది విద్యార్థులు పాల్గొనే క్రీడలో క్రిశాంత్ తేజ పాల్గొని రాష్ట్రంలోనే అతిచిన్న పారాసైలర్ గా సర్టిఫికెట్ అందుకున్నాడు.

Latest Updates