పగలైతే దొరికిపోతామని.. అర్ధరాత్రి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు

గుట్టుచప్పుడు కాకుండా చైల్డ్ మ్యారేజెస్

40 రోజుల్లో వందకు పైగా బాల్య వివాహాలు

వర్ధన్నపేట, వెలుగు: గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో చైల్డ్ మ్యారేజెస్ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే ఆఫీసర్లు దాడులు జరుపుతుండగా.. వీరికి తెలియకుండా వందల సంఖ్యలో పెండ్లిళ్లు జరుగుతున్నాయి. గత రెండు నెలలుగా మంచి ముహుర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఇందులో భారీ సంఖ్యలో చైల్ట్ ​మ్యారేజెస్ జరిగినట్లు సమాచారం. పొద్దంతా అయితే ఆఫీసర్లు దాడులు చేస్తారనే నెపంతో అర్ధరాత్రి పిల్లలకు పెళ్లిళ్లు చేసి బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు.

అర్ధరాత్రి ముహూర్తాలు..

వర్ధన్నపేట మండలం డీసీ తండాలో గురువారం ఓ పన్నెండేళ్ల బాలికకు అర్ధరాత్రి వివాహం నిశ్చయించారు. స్థానికుల సమాచారంతో దాడులు జరిపిన ఆఫీసర్లను, తండావాసులు అడ్డుకున్నారు. ఎంతనచ్చజెప్పినా వినకుండా ఆఫీసర్లపై దాడి చేసేందుకు యత్నించారు. వర్ధన్నపేట ఎస్సై వంశీకృష్ణ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆఫీసర్లు క్షేమంగా బయటపడ్డారు. సీడీపీవో పద్మ, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

ఈ నెల 1న అర్బన్ జిల్లా హసన్​పర్తి మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి ఓ బాలికకు పెండ్లి చేస్తుండగా ఆఫీసర్లు అడ్డుకున్నారు. పరకాల మండలానికి చెందిన రెండు కుటుంబాలు అర్ధరాత్రి పెండ్లి నిశ్చయించగా.. ఆఫీసర్లకు సమాచారం వెళ్లడంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పెండ్లి ఆపారు. వారికి కౌన్సిలింగ్​ఇచ్చి చైల్డ్​ ప్రొటెక్షన్ ​సెంటర్​కు తరలించారు.

లెక్కలేనివెన్నో..

బాల్య వివాహాలు జరుగుతున్నట్లు హెల్ప్ డెస్క్ ద్వారా ఆఫీసర్లకు తెలుస్తున్నాయే తప్ప తెలియకుండా లెక్కలేనన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే ఇటీవల చైల్ట్​మ్యారెజెస్​పై ఆఫీసర్లు ఫీల్డ్​ లెవెల్​లో అవగాహన కల్పిస్తుండగా.. ఆఫీసర్ల కళ్లు గప్పి అర్ధరాత్రి ముహుర్తాలకు కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్ఫింగ్ చేయడం, పూజారులు, ఫొటో గ్రాఫర్లకు ఎక్కువ డబ్బులు ఇచ్చి సెట్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఆఫీసర్లు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు.

ట్రైబల్​ ఏరియాల్లోనే ఎక్కువ

ట్రైబల్​ ఏరియాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పూజారులు వయసును పట్టించుకోకుండా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇది సరికాదు. స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించాలి. చైల్డ్​ మ్యారేజెస్​ జరుగుతున్నట్లు తెలిస్తే సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ‑మండల పరశురాములు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, వరంగల్

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ

నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు

పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

Latest Updates